vehicle purchases | కోల్ సిటీ, అక్టోబర్ 17: రామగుండం నగర పాలక సంస్థ వాహనాల కొనుగోళ్లలో రికార్డులు సృష్టిస్తుంది. ప్రతి ఏటా ఏదొక వాహనంను అత్యధిక వ్యయంతో కొనుగోలు చేసేందుకే ఉత్సాహం చూపుతున్నది. ఇప్పటికే అనేక వాహనాలు కొనుగోలు చేసిన అధికారులు తాజాగా మరో స్కై లిఫ్ట్ హైడ్రాలిక్ వాహనంను కొనుగోలు చేశారు. అందుకు రూ.38లక్షలు ఖర్చు చేశారు. టాటా కంపెనీకి చెందిన ఈ స్కై లిఫ్ట్ హైడ్రాలిక్ వాహనం శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంకు చేరుకుంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఇప్పటికే కార్పొరేషన్ లో మూడు స్కై లిఫ్ట్ వాహనాలు ఉన్నాయి. నగర పాలక పరిధిలో విద్యుత్ దీపాల బిగింపునకు మరో స్కై లిఫ్ట్ భారీ వాహనంకు ప్రతిపాదనలు చేసి ఆ వెంటనే కొనుగోలు చేశారు. దీనితో నగర పాలకలో స్కై లిఫ్ట్ వాహనాల సంఖ్య నాలుగుకు చేరుకొంది. గత జూన్ మాసంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.30 లక్షలు ఖర్చు చేసి జేసీబీ 30 ప్లస్ వాహనం కొనుగోలు చేశారు.
ఆ తర్వాత కూడా స్వచ్ఛ సర్వేక్షన్ ట్రాలీలు, ట్రాక్టర్లు వాహనాలు కొనుగోలు చేశారు. అంచనాలకు మించి ఎక్కువ ఖర్చులు చేయడంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ద వాటి నిర్వహణలో చూపడం లేదనిపిస్తోంది. అధికారులు మాత్రం జీఎస్ టీలు, ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని అంత వ్యయం చేశామని చెబుతున్నారు. గతంలో పట్టణ ప్రగతి, 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధుల నుంచి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు మూన్నాళ్ల ముచ్చటకే మారుతున్నాయి.
వాహనాల కొనుగోళ్లలో చూపుతున్న శ్రద్ధ వాటి నిర్వహణలో చూపకపోవడంతో ఏడాదికే మూలకు పడుతున్నాయని సిబ్బందే బహిరంగంగా వాపోతున్నారు. ఇప్పటికే నగర పాలక కార్యాలయం వెనుకాల అనేక వాహనాలు పని చేయక స్క్రాప్ గా పడేసి ఉన్నాయి. పోనీ ఆ స్క్రాప్‌గా మారిన యంత్రాలు, వాహనాలు, ఇతరత్రా పరికరాలను తూకం లెక్కన అమ్మినా బల్దియాకు ఆదాయం సమకూరుతుందని ఆలోచన చేయడం లేదు. ఈవిషయంలో కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.