చిగురుమామిడి పోలీస్ స్టేషన్కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రస్థాయిలో 9వ స్థానం పొందింది. నేరాల నియంత్రణ, నేరాల ఛేదన, నేరాల ఇన్వెస్టిగేషన్, బాధితులకు న్యాయం, తదితర అంశాల ఆధారంగా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లకు సంబంధించి మంగళవారం ర్యాంకులు ప్రకటించగా, ఇందులో చిగురుమామిడి ఠాణా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా పెంచడంతో నేరాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను సర్పంచులు, దాతల సహకారంతో ఏర్పాటు చేయడంతో చోరీలు తగ్గాయి.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేశారు. స్టేషన్లో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఫలితంగా దొంగతనాలు, ఆకతాయిల ఆగడాలకు చాలా వరకు అడ్డకట్ట పడింది.
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ఎస్ఐ దాస సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన పెరిగి సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అలాగే పోలీసుల తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.
ఉన్నతాధికారుల సహకారంతో వారి సూచనల మేరకు చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. స్టేషన్లో ఆయా విభాగాల పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తుండడంతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించాం. ఇందుకు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి సూచనలు ఎంతగానో దోహదపడ్డాయి. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత సమర్థవంతంగా పని చేస్తాం.
– దాస సుధాకర్, ఎస్ఐ చిగురుమామిడి