కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197,198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ మూడు సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేన్లను రద్దు ప్రక్రియను ఆర్డీవో మహేశ్వర్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. అన్నీ సవ్యంగా సాగితే నాలుగు రోజుల్లో రద్దు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
గంగాధర, మే 28 : కొత్తపల్లి మండలకేంద్రంలోని సర్వే నెంబర్లు 175, 197, 198లో చేసిన భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం నుంచి పది రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి. 30 ఏండ్లుగా సీలింగ్ యాక్టు అమలులో ఉన్నందున సదరు భూములపై ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది. ఈ మూడు సర్వే నెంబర్లలో సుమారు 20 ఎకరాల భూమి ఉండగా అందులో ఎలాంటి లావాదేవీలూ జరపవద్దని 1997, 1998, 2006, 2011, 2016 కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాయానికి నోటీసులు అందాయి. హైకోర్టు ఆర్డర్, కలెక్టర్ నోటీసులను బేఖాతరు చేసిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు సర్వే నెంబర్లు 175లో 3, 197లో 291, 198లో 182 రిజిస్ట్రేషన్లు చేశారు. 2018 వరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజ్రిస్టేషన్ కార్యాయం పరిధిలో ఉన్న కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చారు. కానీ, అప్పటికే కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 424 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తర్వాత గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 52 రిజిస్ట్రేషన్లు కాగా, ఒకటి మాత్రం లోకాయుక్త ఆదేశాల మేరకు జరిగినట్లు తెలిసింది. కొత్తపల్లి భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లపై లోక్‌సత్తా నాయకులు చేసిన పోరాటంతో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ విషయం వెలుగులోకి వచ్చింది. లోకాయుక్త సూచనల మేరకు కలెక్టర్ పమేలా సత్పతి సర్వే నెంబర్లు 175, 197, 198లలో ఇప్పటి వరకు జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
సీలింగ్ యాక్టు అమలులో ఉన్న 175, 197, 198 సర్వే నెంబర్లలో ఎలాంటి లావాదేవీలూ జరపవద్దని హైకోర్టు ఆర్డర్ ఉన్నది. భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఐదు సార్లు కరీంనగర్ రూరల్, గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నోటీసులు అందినా వాటిని బుట్టదాఖలు చేసి రిజిస్ట్రేషన్లు చేసిన అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఉన్నతాధికారులకు తెలియలేదా?, లేక కావాలనే వారు పట్టించుకోలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలిసి 476 రిజిస్ట్రేషన్లకు సంబంధించి కోట్లాది రూపాయల అవినీతి జరిగి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రొహిబిటెడ్ భూముల్లో భూ విక్రయాలు చేసిన అక్రమార్కులు, వీరిని ప్రోత్సహించిన సబ్ రిజిస్ట్రార్లపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని ప్రజలు కోరుతున్నారు.
175, 197, 198 సర్వే నెంబర్లలో అక్రమంగా జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ప్రారంభించాం. అన్నీ సవ్యంగా సాగితే నాలుగు రోజుల్లో క్యాన్సలేషన్ను పూర్తి చేస్తాం. రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.
175, 197, 198 సర్వే నెంబర్లలో అక్రమంగా జరిగిన 476 రిజిస్ట్రేషన్లలో ఏఏ సబ్ రిజిస్ట్రార్ ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఏ సంవత్సరంలో చేశారు అన్న వివరాలను సేకరిస్తున్నాం. రిజిస్ట్రేషన్ల రద్దు పూర్తైన తర్వాత నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.