పేదల బియ్యం పక్కదారి పడుతున్నది. నిఘా కరువై దందా జోరుగా నడుస్తున్నది. పోలీస్ యంత్రాంగం తరచూ పట్టుకుంటున్నా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనేక మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినా.. కొత్తకొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొందరు డీలర్లు అక్రమార్కులతో చేతులు కలుపడం వల్లే రేషన్ పక్కదారి పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తేనే దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల జిల్లాలో రేషన్ బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలు 1,73,745 ఉండగా, 4,97,103 మందికి ఆరుకిలోల చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నది. వీరి కోసం పౌరసరఫరాల శాఖ ప్రతినెలా 3,300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 345 చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తున్నది. అయితే క్షేత్ర సాయిలో పర్యవేక్షణ లేక రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతున్నది. శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలన్నట్టు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.
జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మినీ వ్యాన్లతోపాటు లారీల్లో అక్రమ రవాణా జరుగుతుందనడానికి పోలీసులకు పట్టుబడుతుండడమే నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లాలో చందుర్తి, వేములవాడ, తంగళ్లపల్లి గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్రమ దందా చేస్తున్నట్టు ఇప్పటికే విచారణలో వెలుగుచూస్తున్నది. జిల్లెల్ల గ్రామ కేంద్రంగా కొన్నేండ్ల నుంచి దందా సాగుతున్నట్టు పక్కా సమాచారంతో గుగులోతు పాండును పదిహేను రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకొని కూపీలాగడంతో అక్రమ రవాణా విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.
Karimnagar6
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లెకు చెందిన పాండు జిల్లెల్లలో నివాసముంటూ, కొంత మంది వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నాలుగేండ్లుగా దందా సాగిస్తున్నాడు. ఇతనిపై 14కేసులున్నా లెక్కచేయకుండా అనేక మందిని తయారు చేసి ఈ దందా సాగించినట్టు తెలిసింది. ఇటీవల పోలీసులు పాండును రిమాండ్కు పంపారు. ఇలా అక్రమ దందాకు చెక్ పెడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 185 మందిని అరెస్ట్ చేశారు. 116 కేసులు నమోదు చేసి, 975.9 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో వాహనాలను సీజ్ చేశారు.
అక్రమ దందా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా జిల్లా పౌరసరఫరాల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులను పట్టుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా, స్థానిక పౌరసరఫరాల శాఖ ఎందుకు విచారణ చేపట్టడంలేదని, డీలర్లపై నిఘా ఎందుకు పెట్టడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ దందాకు చెక్ పెట్టి, పేదలకు న్యాయం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.