తిమ్మాపూర్,మార్చి16: మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ వేదికగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల భారీ కుంభకోణం జరిగిందని, ఇప్పటివరకు తమకున్న సమాచారం మేరకు రూ. 6కోట్ల 75లక్షల స్కాం చేశారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన అనుచరుడు షాడో ఎమ్మెల్యే తప్పకుండా జైలుకు పోతారని, పోయేదాకా వదిలేది లేదని మాజీ ఎమ్మేల్యే స్పష్టం చేశారు. ఏసీబీ, విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు పారదర్శకంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని వదిలేది లేదని ప్రభుత్వం వదిలేస్తే కోర్టుకు వెళ్లైనా విచారణ చేయిస్తామని అన్నారు.
ఆదివారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రతి పనికి కమీషన్లు దండుకుంటూ నీచంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గాన్ని పదేళ్లు కష్టపడి అభివృద్ధి పథంలో తీసుకెళ్తే ఈయన పాతాళానికి తొక్కేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి మండలంలో ఆయనకు వచ్చిన కార్యకర్తలను ఎంచుకొని వారి ద్వారా ప్రజల ఆధార్ కార్డులు సేకరించి ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉన్న హాస్పిటల్ నుంచి దొంగ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులు స్కాం చేశారన్నారు.
జమ్మికుంటలోని సురక్ష, భూపాలపల్లిలోని సురక్ష, హైదరాబాదులోని అంకిత్ హాస్పిటల్స్ నుండి బిల్లులు తయారుచేసి ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. దళితుల ఆత్మగౌరవం కోసం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మహానీయులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కవ్వంపల్లి ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ కు ఫిర్యాదు చేసి ఆవిష్కరణ జరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతి దళిత బిడ్డతో కలిసి అంబేద్కర్ జాతర నిర్వహించి విగ్రహాల ఆవిష్కరిస్తానని స్పష్టం చేశారు.
అరుంధతి కల్యాణ మండపాలు కిరాయి పాలు..
దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అరుంధతి కల్యాణ మండపాలు నిర్మాణానికి పనులు ప్రారంభించానని ఎల్ఎండీలో నిర్మించిన కల్యాణ మండపం పూర్తయిందన్నారు. దాన్ని షాడో ఎమ్మెల్యే ఇతర వ్యక్తులకు కిరాయి ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూ దాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నాడని, దళితులకు చెందిన కల్యాణమండపం నీ వద్ద ఎందుకుందని ప్రశ్నించారు. కల్యాణ మండపాన్ని అంబేద్కర్ సంఘం మండల శాఖకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
అవినీతిని ప్రశ్నిస్తే ఆయన అనుచరులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారని, రసమయి అంటే ఆషామాషి కాదని.. లెజెండ్ అని.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తొక్కి పడేస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బోయిని కొమురయ్య, వంతడ్పుల సంపత్, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, వడ్లూరి శంకర్, మల్లేశం, బొర్ర రవీందర్, సుధాగోని సదయ్య గౌడ్, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.