గన్నేరువరం,మార్చి18 : ప్రజలకు ఆశలు చూపి అలవిగాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan 0అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే నెలలోపే డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏడాదిన్నర గడుస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
డబుల్ రోడ్డు నిర్మాణాన్ని నెల రోజుల సమయంలో పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను ఇప్పటివరకు ప్రారంభించలేదని ఎద్దేవా చేశారు. కమీషన్లు తీసుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని, ఇప్పటికైనా కమీషన్ల కోసం కక్కుర్తి పడకుండా అభివృద్ధి చేయాలని హితవు పలికారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా సీఎంఆర్ఎఫ్ స్కాం కు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెరలేపారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.