తిమ్మాపూర్, మే 22 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను చూసి దుఃఖిస్తున్నాడని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆవేదన చెందారు. రోజుల తరబడి వడ్లను కొనుగోలు చేయక.. చేసినా ఎక్కడికక్కడ దోచుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కొనుగోళ్లపై ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. కొనేటోళ్లు లేక రైతులు గోస పడుతున్నారని, దిగాలుతో మానకొండూర్ నియోజకవర్గంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, అయినా పట్టించుకునే వారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నదని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం చేస్తున్నాడని నిలదీశారు. బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించి ధైర్యం చెప్పే వీలులేకుండా పోయిందని విమర్శించారు. వానలు పడేలోగా పంటలు కొనాలని అల్టిమేటం ఇచ్చారు.
రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకొని చలించిపోయారు. అనంతరం తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరి దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారని, కానీ, కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదన్నారు.
వడ్లను కేంద్రంలో పోసిన ప్పటి నుంచి మిల్లులో దింపే వరకూ రైతును కమీషన్లతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఫొటోల ఫోజులే తప్పా కొనుగోళ్లపై పర్యవేక్షణ లేదని, కేంద్రాలను పరిశీలించకుండా రైస్మిల్లల వెంట తిరుగుతున్నాడని విమర్శించారు. మానకొండూర్ నియోజకవర్గంలో నాణ్యమైన వడ్లను బీ గ్రేడ్ కింద తూకం వేస్తూ దోచుకుంటున్నారని విమర్శించారు. దానికి తోడు మూడు, నాలుగు కిలోలు బస్తాకు ఎక్కువ తీసుకుంటున్నారని, ఆ కమీషన్లన్నీ ఎవరికి పోతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. కవ్వంపల్లికి కమీషన్లు చాలకపోతే మా కిడ్నీలు అమ్ముకోవాలని, కానీ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.
ఇప్పటికీ కొనుగోళ్లు సగం కూడా పూర్తి కాలేదని, ఇంకా అరవై శాతం కేంద్రాల్లోనే ఉన్నాయని, మబ్బులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తూకం వేసిన బస్తాలను తరలించేందుకు వాహనాలు లేవని, కవ్వంపల్లికి చెందిన క్వారీలను రెండు మూడు రోజులు బంజేసి ధాన్యం తరలించేందుకు లారీలు అప్పగించాలని సూచించారు. వెంటవెంటనే కొనుగోలు చేయకపోతే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని, రైతులు పండించిన పంటలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోసి నిరసనకు దిగుతామని హెచ్చరించారు. వడ్ల కొనుగోల్లు ఇలా ఉండే సన్ ఫ్లవర్, మక్కల రైతుల వేదన వర్ణాణాతీతమన్నారు. ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం రైతులు నెలలుగా కేంద్రాల్లోనే పడిగాపులు గాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.