మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 8 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. మానకొండూర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, ఆ లక్ష్యాన్ని సాధించామని గుర్తు చేశారు. పార్టీ ఏర్పాటై 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే మహాసభకు మానకొండూర్ నియోజక వర్గం నుంచి దాదాపు 12 వేల నుంచి 20 వేల మంది వరకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఉదయం 10 గంటలకు గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేసి బయలుదేరుతారని, కొందరు ఒక్క రోజు ముందుగానే ట్రాక్టర్లు, కాలినడకన ద్వారా కూడా వస్తారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, అన్ని అనుమతులతో కచ్చితంగా సభను విజయవంతం చేస్తామని తెలిపారు.
సమావేశంలో రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ జడ్పీటీసీలు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శంకరపట్నం మండలాధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ సర్పంచులు రామంచ గోపాల్‌రెడ్డి, దేవ సతీశ్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, నాయకులు పల్లె నర్సింహారెడ్డి, గూడూరి సురేశ్, సతీశ్, ఇస్కుల్ల అంజనేయులు, పిండి సందీప్, తదితరులు పాల్గొన్నారు.