కోనరావుపేట, మే 13: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్-9 పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చే యాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదేశించారు. కోనరావుపేట మం డలంలోని మల్కపేట రిజర్వాయర్ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్ట్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా రిజర్వాయర్ పనులు ఎంత మేర పూర్తయ్యాయి, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ.504 కోట్లతో ప్రారంభమైన మల్కపేట రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. అక్కడక్కడ చిన్నచిన్న భూ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలు నిర్మించగా మిగులు భూముల సమస్య పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ప్రధానంగా మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు వరకు లిఫ్ట్ ద్వారా నీళ్లందించేందుకు రూ.163 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజ్ 9 ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని చంద్రగిరి, జయవరం, లింగంపల్లి, మారుపాక, తిప్పాపురం గ్రామాల్లో 5601 ఎకరాలు, కోనరావుపేట మండలంలో ని ధర్మారం, కనగర్తి, కొలనూర్, పల్లిమక్త, మల్కపేట, మర్తనపేట, నాగారం, నిజామాబాద్, రామన్నపేట, సుద్దాలలో 25,694 ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఈఈ గంగం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపు పరశురాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, సర్పంచులు కదిరె శ్రీనివాస్, శివంగాల ఎల్లయ్య, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి, తహసీల్దార్ రవికాంత్, డీఈలు, ఏఈలు ఉన్నారు.