KTR | కోల్ సిటీ, ఆగస్టు 20: ‘రామన్నా… మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేమన్నా… ఆపదలో ఉన్న ఎంతోమంది అడపడుచులకు అన్నగా… మీరున్నారన్న ధైర్యం మాకు చాలన్నా… మీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఒక్కడు ఉంటే చాలన్నా …ఖుదా.. హఫీజ్..’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు తస్నీం భాను బుధవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల గోదావరిఖనికి చెందిన ముస్లిం మహిళ దుబాయిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయంను వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి సహకారంతో కేటీఆర్ ను కలిసి విన్నవించిన వెంటనే ఆయన స్పందించి దుబాయిలో ఇబ్బంది పడుతున్న ముస్లిం మహిళను క్షేమంగా గోదావరిఖనికి తీసుకవచ్చినందుకు కృతజ్ఞతగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రామగుండం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వరుస సంఘటనలపై ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకవెళ్లినట్లు తెలిపారు. రామగుండంలో జరుగుతున్న నియంత పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని కోరినట్లు తెలిపారు. ఇక్కడ వ్యాల హరీష్ రెడ్డి, జాహెద్ పాషా తదితరులు ఉన్నారు.