Murder | మల్యాల, జూన్ 09: కొండగట్టులో ఈ నెల 02 వ తేదిన జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసి దృష్యం సినిమా తరహాలో ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు పూడ్చి వేసిన అంశం బయటకి పొక్కడంతో విచారణ చేపట్టిన మల్యాల సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ దురుశెట్టి రఘుచందర్ తెలిపారు.
మల్యాల పోలీస్టేషన్లో సీఐ నీలం రవితో కలసి నిందితుల వివరాలను సోమవారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ రఘుచందర్ కథనం ప్రకారం.. కొండగట్టుకు చెందిన ఉప్పు రమణారెడ్డికి బండి సిద్దు అలియాస్ సిద్ధార్థ్ మధ్య గతంలో నుండి గొడవలు ఉన్నాయి. జూన్ 2న బండి సిద్ధార్ధ వివాహానికి ముందు జరిగే హల్దీ వేడుక ఉన్నందున సిద్ధార్థ ఇంటికి రమణారెడ్డి వెళ్లాడు. సిద్ధార్థను, సిదార్థ స్నేహితులను సైతం చంపివేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో సిద్దార్థ, అతని స్నేహితులు చింతలకోటి వినయ్, పస్థం ఈశ్వర్లు రమణారెడ్డి తమకు ప్రతీ విషయంలో ఆధిపత్ రమణారెడ్డి అడ్డుపడుతున్నాడనే కారణంతో చంపాలని నిశ్చయించుకుంటారు.
జూన్ 2న రాత్రి పది గంటల సమయంలో బండి సిద్ధార్థ, చింతలకోటి వినయ్ కొండగట్టు దిగువన గల బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో రమణారెడ్డి అక్కడి చేరుకోగా వారితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అక్కడికి పల్సర్ బైక్‌పై చేరుకున్న పాస్థం ఈశ్వర్ మరియు అతని స్నేహితులు రమణారెడ్డిని తన బండిపై బలవంతంగా కొండ పైకి వెళ్లే మెట్లదారి పక్కన గల నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు.
రమణారెడ్డి (30)ని చేతులతో తీవ్రంగా కొట్టి కిందద పడవేసి బండరాళ్లను అతనిపై వేసి హత్య చేశారు. మృతదేహం అక్కడే ఉంటే తమపై అనుమానం వస్థుందనే ఉద్దేశ్యంతో బండి సిద్ధార్థ, పాస్థం ఈశ్వర్లు వెంటనే వారి స్నేహితులైన దాసరి ఆకాష్, మంచినీళ్ల అజయ్ తో మరో ఇద్దరు మైనర్ వ్యక్తులను తీసుకుని పోవడంతో పాటు మట్టి తీసే పారను పంజాల మధును తీసుకుని రమ్మన్నారు.
ఈ క్రమంలోనే పంజాల మధును పారసు తీసుకుని వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న బండి సిద్ధార్థ, పాస్థం ఈశ్వర్, దాసరి ఆకాష్, అజయ్, చింతలకోటి వినయ్ తో మరో ఇద్దరు మైనర్ వ్యక్తులు మృతదేహాన్ని మెట్లదారి సమీపంలో గల ఉపాధిహామీ గుంతల వద్దకు ఈడ్చుకు వెళ్లి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఆ తదుపరి హత్యలో పాల్గొన్న బండి సిద్దార్థ్ జూన్ 5 వివాహం చేసుకున్నాడన్నారు.
మృతుడు రమణారెడ్డి గత ఐదు రోజులుగా కనిపించకపోవడంతో మృతుడు సోదరుడు నిరంజన్‌రెడ్డి తమ తమ్ముడు గూర్చి స్థానికులను వాకబు చేయడంతో కొంతమంది యువకులతో కొండగట్టులో తమ తమ్ముడుకి కొంతమంది యువకులకు గొడవ జరిగిందని తెలియడంతో మల్యాల పోలీస్ స్టేషన్ జూన్ 7న ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్యాల సీఐ నీలం రవి, ఎస్ఐ నరేష్ కుమార్ నేతృత్వంలో సాంకేతిక పరిజాణం ఆధారాలు సేకరించడంతో పాటూ పలువురు యువకులను గురించి విచారించగా రమణారెడ్డిని తీవ్రంగా కొట్టి చంపివేసినట్లు పాస్టం ఈశ్వర్ నేరం ఒప్పుకున్నారన్నారు.
ఈ క్రమంలోనే మల్యాల తహసీల్దార్, వైద్యబృందం నేతృత్వంలో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. మృతుడు రమణారెడ్డిగా కుటుంబ సభ్యులు ధృవీకరించారన్నారు. మృతుడు రమణారెడ్డిపై పలు పోలీస్టేషన్లలో ఇప్పటి వరకు 27 కేసులలో నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. రమణారెడ్డి హత్య కేసు విషయమై దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటూ నిందితులను గుర్తించడంతో పాటూ అరెస్ట్ చేశామన్నారు.
అరెస్ట్ అయిన వారిలో కొండగట్టుకు చెందిన బండి సిద్ధార్థ, పాస్టం ఈశ్వర్, దాసరి ఆకాష్, మంచినీళ్ల అజయ్, పంజాల మధు వేములవాడ మండలం మర్రిపల్లికి చెందిన చింతలకోటి వినయ్ తో పాటూ ఇతర గ్రామాలకు చెందిన ఆద్దరు మైనర్ బాలురు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారి నుండి పల్సర్ బైక్ తో పాటు 9 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకుని స్వీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్యాల, కోడిమ్యాల, పెగడపల్లి ఎస్సైలు నరేష్ కుమార్, సందీప్, రవీందర్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.