Godavarikhani | కోల్ సిటీ, మే 24: రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య మహిళా కార్మికురాలు మల్లమ్మ మృతికి కమిషనర్ జే.అరుణ శ్రీ బాధ్యత వహించాలనీ, మృతురాలి కుటుంబంకు రూ.20లక్షల నష్ట పరిహారం చెల్లించాలని మున్సిపల్ జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఈనెల 21న విధి నిర్వహణలో వడదెబ్బతో పని ప్రదేశంలో కుప్పకూలిన మల్లమ్మను గమనించలేదనీ, ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
చివరకు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయి విగత జీవిరాలిగా కనిపించిందన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ పని వేళల్లో వెసలుబాటు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచడం వల్ల మానసిక, శారీరక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. నగర పాలక కమిషనర్ ప్రస్తుత స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా మొండితనంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. కార్మికులను బానిసలుగా పని చేయించుకోవడంతోనే మల్లమ్మ చనిపోయిందన్నారు.
ఆమె మృతికి కారణమైన కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులను ఇష్టం వచ్చినట్లుగా మార్చడం, విధుల నుంచి తొలగించడం రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేసవిలో కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మికుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న కమిషనర్ పై ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో రేణికుంట్ల సారయ్య, కిషన్ నాయక్, రమణ, వేల్పుల రాయమల్లు, రొడ్డ రాజేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.