Ramagundam Lions Club | కోల్ సిటీ, జూలై 30: రామగుండం లయన్స్ క్లబ్ సేవలకు తాను ఫిదా అయ్యానని, 320 జీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా బుధవారం రామగుండం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా లయన్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేసి సరస్వతీ శిశు మందిర్ లో పర్యావరణం పెంపొందించడానికి మొక్కలు నాటారు.
లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ డా. బాబురావు జన్మదినం సందర్భంగా మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా పేదలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం క్లబ్ భవన్ లో దాదాపు రూ.20లక్షల విలువైన కృత్రిమ అవయవాలను గవర్నర్ చేతుల మీదుగా 35 మందికి వికలాంగులకు తొడిగారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయి శాశ్వతంగా అంగ వైకల్యంతో మానసిక క్షోభ అనుభవించే ఎంతోమంది జీవితాల్లో రామగుండం క్లబ్ సభ్యులు వెలుగులు నింపి పూర్వ జన్మ ప్రసాదించడం గర్వంగా ఉందన్నారు.
రామగుండం లయన్స్ క్లబ్ అంటేనే నిబద్ధత, అంకితభావం, సేవకు పెట్టింది పేరుగా రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్లబ్ కు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిస్ట్రిక్ గవర్నర్ ప్రమోద్ కుమార్ రెడ్డి, రీజనల్ చైర్మన్ రాజేందర్, జోన్ చైర్మన్ పీ మల్లికార్జున్, పాస్ట్ ప్రెసిడెంట్ తానిపర్తి విజయలక్ష్మీ, ఉపాధ్యక్షుడు లయన్ పోకల ఆంజనేయులు, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేంద్రకుమార్, సభ్యులు గంగాధర్, తిలక్ చక్రవర్తి, గుండా వీరేశం, లక్ష్మారెడ్డి, మనోజ్ కుమార్, గోపాల్ త్రివేది, గుండ రాజు, సత్యనారాయణ, రంగమ్మ, రమణారెడ్డి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.