Ramagundam Baldia | కోల్ సిటీ, నవంబర్ 7: పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగర పాలక కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
హిందూ ధార్మిక సంఘాలు, కుల సంఘాలు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు ఐక్యవేదికగా ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. గోదావరిఖనిలో నాలుగు గంటల పాటు జరిగిన శాంతియుత ఆందోళనకు సామాన్య జనం సైతం కదిలివచ్చింది. వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద పెట్టున నినదించింది. కోర్డు ఆర్డినెన్స్ ప్రకారమే కూల్చారంటూ జనహిత పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి ఆ ఉత్తర్వులు చూపించాలనీ, లేదంటే బడితపూజ తప్పదంటూ హెచ్చరించింది.
ముందుగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉదయం 10 గం.లకు సమావేశమైన ఐక్య వేదిక నాయకులు భారీ ర్యాలీగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంకు చేరుకున్నారు. అప్పటికే కార్యాలయం అన్ని ద్వారాలను పోలీసులు మూసివేశారు. దాంతో కార్యాలయం బయట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పలుకుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రామగుండంకు ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడం లేదనీ, ఆయన అనుచర వర్గమంతా తామే ఎమ్మెల్యేలమని చెప్పుకుంటూ ఏది కనిపిస్తే అది కూల్చివేయడం ఏమిటని వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2009లో సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ నం.262 ప్రకారం ట్రాఫిక్ కు అంతరాయం కలిగే ప్రదేశాల్లో ఉన్న మందిరాలను ప్రజలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని చెబుతుందనీ, కానీ రామగుండంలో మాత్రం తానే కోర్టు అన్న విధంగా స్థానిక ప్రజాప్రతినిధి వ్యవహరించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకరాకుండా సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతో బలవంతంగా సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయించి తానే ప్రభుత్వం నుంచి తీసుకవస్తున్నట్లు ఫోజులు కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక జనం నిద్రిస్తున్న సమయంలో మైసమ్మ గుళ్లను కూల్చివేయడం బాధాకరమన్నారు.
కలెక్టర్ వచ్చి వెంటనే కమిషనర్ ను సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. కలెక్టర్ కు ఫోన్ చేయగా మీటింగ్ లో ఉన్నాడని చెప్పడంతో అనంతరం రాజీవ్ రహదారి వద్దకు ర్యాలీగా చేరుకొని అక్కడ గంట పాటు మండుటెండలో బైఠాయించారు. ఇరువైపులా దారిపొడవునా వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దంటూ కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సంఘటనపై శనివారం కూల్చివేసిన మైసమ్మ గుళ్ల వద్ద నిరసనలు, ఆదివారం అక్కడే సంప్రోక్షణ పూజలు చేస్తామనీ, కూల్చివేసిన మైసమ్మ గుళ్ల స్థానంలో మళ్లీ పునర్నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం అంతా ఒకతాటిపైకి వచ్చి ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీద ఎక్కడ కనిపించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఆందోళన వద్దకు వచ్చే ముఖం లేక అంతా ఇళ్లలో దాక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ ఫోన్ లో అందుబాటులోకి వచ్చి మాట్లాడగా, ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా నాలుగు గంటల పాటు జరిగిన ఆందోళనతో నగరమంతా అట్టుడికిపోయింది. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేశ్, కౌశిక హరి, కందుల సంధ్యారాణి, మేకల గోపాలకృష్ణ యాదవ్, పిడగు కృష్ణ, సుల్వ లక్ష్మీ నరసయ్య, అయోధ్య రవీందర్, సంపత్, కట్టా సురేష్ భవాని, వెంచర్ల మహేష్ తో పాటు వందల సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.