Ramagundam | కోల్ సిటీ, జూన్ 14: రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు. నగరంలోని ప్రధాన రోడ్లపై పశువులు తిష్ట వేసి ఉండటంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కమిషనర్ స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు నుంచి ఎక్కడ పశువులు కనిపించినా గోశాలకు తరలిస్తామని స్పష్టం చేశారు.
కానీ ఇప్పటికి పది రోజులు కావస్తున్నా ఎక్కడ పశువులు అక్కడే తిష్ట వేస్తున్నాయి. ప్రధాన రోడ్లపైనే కలియ తిరుగుతున్నాయి. కమిషనర్ ఆదేశాలను అటు పశువుల యజమానులు, ఇటు మున్సిపల్ సిబ్బంది బేఖాతరు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ సిబ్బంది స్పందించి రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాల కు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.