Swachh Survekshan | కోల్ సిటీ, జూలై 17: రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలో 28వ ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకుల్లో రామగుండం నగరం ఉత్తమ ర్యాంకు సాధించింది. దేశ వ్యాప్తంగా 4589 పట్టణాలలో పోటీ పడి 216వ ర్యాంకు సాధించడం విశేషం.
రాష్ట్రంలోని 143 మున్సిపాలిటీలలో 28వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది మల్కాపూర్ వద్ద నిర్మించిన ఎస్టీపీ ఉపయోగంలోకి తీసుకురావడంతో రామగుండం నగరంకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా దక్కింది. రామగుండం నగరం మెరుగైన ర్యాంకు సాధించడానికి ఈ హోదా తోడ్పడింది. నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుదలకు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి.
అలాగే 2022లో కేంద్రప్రభుత్వం అర్బన్ ఔట్ కమ్ ఫ్రేమ్ వర్క్స్ భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రూపొందించేందుకు చేపట్టిన సిటిజన్ పర్సెప్షన్ సర్వే యాక్టివిటిలో రాష్ట్రంలోనే ఏకైక కార్పొరేషన్ గా రామగుండంకు చోటు దక్కింది. కాగా రామగుండం నగరం ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.