Blood donation | కోల్ సిటీ, జూన్ 9: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ (ఎఫ్ఎపీ) జే.ఆరుణ శ్రీ హాజరై ప్రత్యేకంగా అభినందించారు.
నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఆర్.ఐ శంకర్ రావు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధు, శ్రీకాంత్, వీఆర్ ఓలు శ్రీపాల్, శంకరస్వామితోపాటు వివిధ విభాగాల ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది మొత్తం 30 మంది రక్తదానం చేశారు. వీరికి అదనపు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేసి ప్రశంసించారు. గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వైద్యులు, సిబ్బంది హాజరై రక్తనమూనాలు సేకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మాట్లాడారు. విధి నిర్వహణలో రోజంతా తలమునకలై ఒత్తిళ్లకు లోనయ్యే తమ కార్యాలయ ఉద్యోగులు, అధికారులు సమాజ హితం కోసం ఆలోచించి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికను సమర్ధవంతంగా నిర్వహిస్తుండటంతోపాటు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.
ఇలాంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలతో కార్పొరేషన్ కు ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఆర్ ఐ శంకర్ రావు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు డా. అముల్, స్వాతి, ల్యాబ్ టెక్నిషియన్ రాజు, నర్సు సాయివర్షిణి తదితరులు పాల్గొన్నారు.