sanitation workers | కోల్ సిటీ, ఏప్రిల్ 20 : దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జ్ఞాపకార్థం రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు స్టీల్ వాటర్ బాటిళ్లు ఆదివారం అందజేశారు. ఈ మేరకు గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ చేతుల మీదుగా పారిశుద్ధ్య విభాగం కార్మికులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివంగత శ్రీపాదరావు జ్ఞాపకార్థం ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు వీటిని అందజేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రామగుండం నగరంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, ప్రస్తుత వేసవి కాలంలో విధి నిర్వహణలో ఎండ తీవ్రత మూలంగా కార్మికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చల్లని నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ స్టీల్ వాటర్ బాటిల్ లో దోహదపడతాయని పేర్కొన్నారు. వీటిని పారిశుద్ధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్ రావు, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, పెద్దెల్లి తేజస్వి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, కొప్పుల శంకర్, ఎండీ యాకూబ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.