Korukanti Chander | కోల్ సిటీ, డిసెంబర్ 31: ‘రామగుండం కార్పొరేషన్ లో చట్టం ఎవరికి చుట్టమైంది..? రెండేళ్లుగా ఇష్టానురీతిగా అక్రమ కూల్చివేతలు జరుగుతుంటే చర్యలేవి..? స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఒక ఐఏఎస్ అధికారి నడుచుకుంటూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు. వెంటనే ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేయాలని’ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్షను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడిచిన రెండేళ్లుగా పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతలు, విధ్వంసాలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, ఎప్పుడు ఏ వీధిలో ఇళ్లను కూలుస్తారో తెలియని భయంతో జీవిస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండంలో మున్సిపల్ అధికారులు స్వయం ప్రతిపత్తి కోల్పోయి స్థానిక ప్రజాప్రతినిధికి తొత్తులుగా మారడం శోచనీయన్నారు.
ఇక్కడి అధికారులకు జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ నాయకులు కాదని, ప్రజలు అనేది గుర్తించాలని సూచించారు. ఇటీవల నగరంలో 46 దారి మైసమ్మ గుళ్లను రాత్రికి రాత్రి నేలమట్టం చేశారని, అడిగితే గుర్తు తెలియని దొంగలు అని బుకాయించారన్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత రాగానే, కాంగ్రెస్ నాయకులు తమ తప్పు తెలుసుకొని దిద్దుబాటుగా అప్పటికప్పుడు గుళ్లు కట్టించి బయటపడ్డారని గుర్తు చేశారు.
బాధ్యతాయుతమైన కమిషనర్ పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి స్థానిక చోటామోటా కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టడం శోచనీయమన్నారు. తన షాపును కూల్చినందుకు న్యాయం కోసం గత 10 రోజులుగా సిరిశెట్టి జయసుధ మల్లేశం కుటుంబం తమ పిల్లలతో దీక్ష చేస్తుంటే కనీసం మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం సరికాదని, ఆ కుటుంబానికి మీరైనా తగు న్యాయం చేయాలని కోరారు. రెండేళ్లుగా కూల్చివేతలకు గురైన బాధితులకు స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ ఒక్క పైసా కూడా నష్టపరిహారంగా ఇవ్వలేదని మండిపడ్డారు.
గతంలో ఇక్కడ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులు పని చేశారని, కానీ ఈ విధంగా రాజకీయ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకోలేదన్నారు. ఇకనైనా అధికారులు ప్రజలకు జవాబుదారీగా నడుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ఛార్జి కమిషనర్ ను విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నీరటి శ్రీనివాస్, నారాయణ దాసు మారుతి తదితరులు పాల్గొన్నారు.