అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలు హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో ఆంక్షలు పెడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మెజార్టీ పథకాల్లో కొర్రీలు పెట్టి, కోత విధిస్తున్నది. రాజీవ్ యువ వికాసం నుంచి రైతుభరోసా వరకు అన్నింటికీ ‘రూల్స్ అప్లయ్’ అంటూ కఠిన నిబంధనలు తెస్తుండడంతో ఎవరికీ వర్తించని పరిస్థితి కనిపిస్తున్నది. కొద్ది మందికే పథకాలు అమలు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుండగా, మెలికలతో వేలాది మంది దరఖాస్తులుదారులు నిరాశకు లోనవుతున్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చివరికి రేషన్ కార్డులు పొందాలన్నా నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలకు నిబంధనల పేరిట అడ్డగోలు కొర్రీలు పెట్టింది. మెజార్టీ పథకాలకు ఏదో ఒక మెలిక కనిపిస్తున్నది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి రాజీవ్ యువ వికాసం పేరిట అమలు చేస్తున్న పథకంలో కఠిన నిబంధలు పెట్టింది. 50 వేల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీపై రుణాలు ఇస్తామని చెబితే వేల సంఖ్యలో జనం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్‌ల కోసం వందల్లో ఖర్చు చేశారు. తీరా సిబిల్ స్కోర్ ఉన్న వారికే రుణాలు ఇస్తామని కొత్త మెలిక పెట్టడంతో కంగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాలు తీసుకున్న వారు, రుణాలు తీసుకొని చెల్లించని వారు అనర్హులని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా గతంలో రుణాలు తీసుకున్న వారిని మినహాయిస్తే నిజానికి తప్పేమీ లేదు.
కానీ, సిబిల్ స్కోర్ ఉంటేనే రుణాలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం మాత్రం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు చేస్తున్నది. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని, సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే సిబిల్ స్కోర్ బాగుంటుంది. కానీ, రుణాలు తీసుకోని వారి పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. వివిధ కార్పొరేషన్ల ద్వారా కరీంనగర్ జిల్లాలో ఈ పథకం కింద 57,763 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మండల స్థాయిలో దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా, వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ, వచ్చిన దరఖాస్తుల్లో చాలా మంది నిరుపేదలే ఉన్నారు. వీరికి బ్యాంకులతో ఎలాంటి సంబంధాలూ లేవు. అయితే, లేని సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుందని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ పథకం కింద బ్యాంకులు ఇచ్చేది నామ మాత్రమే అయినా, సిబిల్‌తో లింక్ పెట్టడం ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో 10 శాతం మందికి కూడా రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేస్తున్న కొన్ని పథకాల్లోనూ ప్రభుత్వం ఇవే కొర్రీలు పెట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇంటికి కూడా మెలిక పెట్టింది. గత జనవరి 26న లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వం మండలానికో గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని భావించిన దరఖాస్తు దారులకు నిరాశే మిగిలింది. ఇందిరమ్మ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపిక చేసిన వారే లబ్ధిదారులయ్యారు. ఈ రకంగా దరఖాస్తు చేసుకున్న కొందరిపై వేటు పడగా మిగిలిన వారు ఇండ్లు నిర్మించుకునే క్రమంలో పెట్టిన నిబంధనల మేరకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇండ్లు మంజూరు ప్రొసీడింగులలో ఎక్కడా కొలతలు మెన్షన్ చేయక పోవడంతో లబ్ధిదారులు తమకు తోచిన విధంగా మార్కౌట్ చేసుకుని బేసిమెంట్లు నిర్మించుకున్నారు. తీరా 400 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాలు మాత్రమే ఉంటే గానీ, బిల్లులు చెల్లించేదిలేదని కొర్రీలు పెట్టింది. దీంతో కొలతకు మించి ఇండ్లు కట్టుకున్న పదుల సంఖ్యలో లబ్ధిదారులు కంగుతిన్నారు. కట్టిన బేసిమెంట్లు కూల్చలేక, నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. శిథిలమైన ఇండ్లు ఉన్న కొందరు పక్కన ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించినా అధికారులు ఒప్పుకోవడం లేదు. ఉన్న ఇంటిని కూల్చి కొత్తగా కడితేనే బిల్లులు వస్తాయని లబ్ధిదారుల ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఇలాంటి కఠిన నిబంధనలతో వారు విసిగిపోతున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట తెచ్చిన మరో పథకంలోనూ ఇదే పరిస్థితి. వ్యవసాయ కూలీలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి 6 వేల చొప్పున ఏడాదికి 12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వీరికి ఉపాధిహామీ కార్డు ఉండి ఏడాదికి 20 రోజులు పని చేసి ఉండాలని నిబంధన పెట్టింది. అంతే కాకుండా, దరఖాస్తుదారుల పేరిటగాని వారి కుటుంబ సభ్యుల పేరిటగాని గుంట భూమి కూడా ఉండ కూడదని మరో మెలిక పెట్టింది. దీంతో ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఉన్నప్పటికీ వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. ఉపాధి హామీ జాబ్ కార్డు, ఆధార్ కార్డులో లింకప్ అయిన బ్యాంక్ ఖాతా ఉంటేనే ఇప్పుడు ఇందిరమ్మ భరోసాకు ఎంపిక చేస్తున్నారు. ఒక్కో పైలెట్ గ్రామంలో సగటున పదికి తక్కువ మందే ఈ పథకానికి ఎంపికయ్యారు. రేషన్ కార్డు కోసం కూడా భూమితో లింక్ పెట్టారు. ఇక సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా అన్న ప్రభుత్వం.. సాగు చేస్తున్న వందలాది మంది రైతులను ఈ పథకానికి దూరం చేసింది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా వర్తిస్తుందనేది ఇప్పటి వరకు ప్రకటించని సర్కారు ఇప్పటి వరకు నాలుగెకరాల లోపు ఉన్న రైతుల వరకే ఈ పథకాన్ని అమలు చేసింది. అధికారంలోకి రాక ముందు ప్రతి సీజన్‌కు 7,500 చొప్పున ఏటా 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలతో సరిపెట్టింది. ఇలా ప్రతి పథకంలోనూ కొర్రీలు పెట్టి అనేక మంది నిరుపేదలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఈ నెల 20 వరకు మండల స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి జిల్లా కమిటీలకు సిఫారసు చేస్తారు. ఈ నెల 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు జారీ చేయాలి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాలు పంపిణీ ప్రారంభించి 9 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, సిబిల్ స్కోర్ ప్రాతిపదికన ఎంపిక చేస్తే మాత్రం ఈ పథకాలకు ఎవరూ ఎంపికయ్యే పరిస్థితి ఉండదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. నిజానికి 50 వేల వరకు పూర్తి సబ్సిడీపై రుణం ఇస్తున్నారు. 1,00,001 వరకు 80 శాతం, 2,00,001 నుంచి 4 లక్షల వరకు 70 శాతం వరకు రుణాలు ఇస్తున్నారు.
అంటే బ్యాంకులు ఇచ్చేదాని కంటే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడే ఎక్కువగా ఉంది. కానీ, లబ్ధిదారులను బ్యాంకులు నమ్మాల్సిన అవసరం కనిపిస్తున్నది. అందుకే సిబిల్ స్కోర్ నిబంధన ప్రవేశ పెట్టినట్టు తెలుస్తున్నది. సిబిల్ చూడాలంటే ఒక్కో లబ్ధిదారుడు 100 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వస్తుందో లేదో తెలియని రుణానికి ఇప్పటికే వందల్లో ఖర్చు చేశామని, ఇది మరో ఖర్చని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో 10 శాతం దరఖాస్తు దారులకు కూడా రుణాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సిబిల్ నిబంధనను తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.