కరీం‘నగరం’ నడిబొడ్డున సర్కారు నిధులతో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయంలో అధికారులు పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతున్నది. ఏకంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నుంచి రూ.12.50లక్షలు వెచ్చించి విగ్రహాన్ని తయారు చేయించి పెడుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. నిబంధనల ప్రకారం మహాత్మాగాంధీతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల తయారీకి మాత్రమే సర్కారు నిధులను వినియోగించుకునే అవకాశం ఉన్నది. కానీ, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తయారు చేయించడానికి సుడా నిధులు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుండగా, అధికారయంత్రాంగం ఎలా అనుమతి ఇచ్చిందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్లా మారింది. ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకునేందుకు పలు ప్రజా సంఘాలు సిద్ధమవుతుండగా, ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారుల్లో హైరానా మొదలైంది.
కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్‌చౌక్ చౌరస్తాను సుందరీకరించడంతోపాటు అక్కడ కొత్తగా రాజీవ్ విగ్రహాన్ని పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం పలువురు మంత్రుల చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. నిజానికి ఇక్కడ గతంలో రాజీవ్ విగ్రహం ఉండేది. అయినా రాజకీయ నాయకులు పై నాయకుల మెప్పు పొందడానికి పాత విగ్రహాన్ని పక్కన పెట్టి, కొత్తగా రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం పెట్టాలని నిర్ణయించారు. అక్కడి వరకు బాగానే ఉన్నది.
కానీ, అసలు ట్విస్ట్ ఏమిటంటే.. సుడా నిధులతో ఈ విగ్రహాన్ని తయారీ చేయించడం! నిబంధనల ప్రకారం చూస్తే.. చౌరస్తాల బ్యూటిఫికేషన్ కోసం సర్కారు సొమ్ము నుంచి నిధులను వినియోగించవచ్చు. విగ్రహాల తయారీ మాత్రం ప్రైవేట్‌గా పెట్టుకోవాల్సిందే. కానీ, ఇక్కడ సుడా అధికారులు పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కారు. సుమారు 400 నుంచి 450 కిలోల బరువుతో తొమ్మిది అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహం తయారీ కోసం ఏకంగా సుడాకు చెందిన రూ.12.50 లక్షలను వెచ్చించారు. అందుకోసం టెండర్లు పిలిచి మరి విగ్రహం తయారు చేయించారు. ఇది సుమారు 5-6 మి.మీ. మందంతో అధిక నాణ్యత మిశ్రమ కాంస్య పోత ఉంటుందని, అలాగే రాగి (80-85 శాతం), తగరం (6-8శాతం), జింక్ (6-8శాతం), సీసం (3-4 శాతం) ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారం చూస్తే.. జాతిపిత మహాత్మాగాంధీతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు మాత్రమే సుడా లేదా కార్పొరేషన్ లేదా సర్కారు నిధులను వినియోగించుకోవచ్చు. కానీ, ఇక్కడ అధికారులు ఆ నిబంధనలను పక్కన పెట్టి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే ఈ చౌరస్తా సుందరీకరణకు దాదాపు రూ.25 లక్షలు వెచ్చిస్తుండగా, అందులో విగ్రహం తయారీకే ఏకంగా రూ.12.50 లక్షలు వెచ్చించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ నిధుల కేటాయింపుతోపాటు టెండర్లు పిలిచే సమయంలోనే అధికారులు నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉన్నా.. అధికారులు మాత్రం పూర్తిగా విస్మరించారన్న విమర్శలు వస్తున్నాయి.
అడ్డుకుంటామంటున్న ప్రజాసంఘాలు
ఇటీవల రాష్ట్ర సెక్రటేరియట్ ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ తయారీ కోసం సర్కారు నిధులను కేటాయించలేదు. ప్రైవేట్ వాళ్లు ఇచ్చారు. అలాగే, కరీంనగర్ జిల్లా కేంద్రంలోనూ అనేక విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. విగ్రహాల తయారీ కోసం ప్రైవేట్ వ్యక్తులే డబ్బులు వెచ్చించారు. గతంలో తెలంగాణ చౌరస్తాలో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చింది. ఆ సమయంలో కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించాలని కోరగా.. అది నిబంధనలకు పూర్తి విరుద్ధమని తోసి పుచ్చారు. దీంతో ఆ విగ్రహ ప్రతిష్టాపన నేటివరకు జరగలేదు.
కానీ, ప్రస్తుతం సుడా నిధులతో ఏకంగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తయారీ చేయించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంత మంది నాయకులు పై నేతల మెప్పు పొందడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే.. ఈ విగ్రహం తయారీ, ఆవిష్కరణ అన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి విగ్రహ ఆవిష్కరణకు ఎవరూ అడ్డు చెప్పడం లేదు. కానీ, ప్రజల డబ్బులను వెచ్చించడం ఎంత వరకు సముచితమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. విచారణ చేస్తే.. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన అధికారులపై వేటు తప్పదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రజల సొమ్ముతో తయారు చేయించిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనుండగా, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని పలు ప్రజాసంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మంత్రులు ఆలోచిస్తారా.. మిగిలిన వాటికి నిధులు ఇస్తారా..
రాజీవ్‌చౌక్‌లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగానిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సి మహేశ్ కుమార్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతుండగా, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. అయితే విగ్రహం కోసం సర్కారు నిధులు వినియోగించిన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తతుండగా, ఆవిష్కరణకు వచ్చే మంత్రులు ముందుగా ఆలోచించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించి, ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ విషయంలో మంత్రులు వెనక్కి తగ్గుతారా.. లేక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారా..? అన్నది తేలాల్సి ఉంది. ఇలా ఉంటే.. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో మాజీ ప్రధానులకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. అందుకు సబంధించిన దరఖాస్తులు కార్పొరేషన్లో పెడింగ్‌లో ఉన్నాయి. ఉదాహరణకు మాజీ ప్రధాని, ఈప్రాంత బిడ్డ పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది. వీరితోపాటు మరికొంత మంది ప్రధానుల విగ్రహాల ఏర్పాటుకు నిధులు కార్పొరేషన్ నుంచి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉన్నది. రాజీవ్‌గాంధీ విగ్రహ తయారీకి సుడా నుంచి నిధులు కేటాయించినప్పుడు… మిగిలిన విగ్రహాల తయారీకి ఎందుకు కేటాయించారన్న ప్రశ్నలు నేటి నుంచి అధికారులకు ఎదురు కానున్నాయి.
