ధర్మపురి, నవంబర్ 20 : ధర్మపురి మండలంలోని రాజారంలో నిర్మించిన గడి గత చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్నది. నిర్మించి 11 దశాబ్దాలు దాటుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నది. 13 ఎకరాల సువిశాల స్థలంలో రూపుదిద్దుకున్న భవనం నాడు దేశ్ముఖ్ల పాలనా కేంద్రంగా విలసిల్లింది. శత్రు దుర్బేధ్యమైన పురాతనమైన నివాసం నేడు గూడులేని నిరుపేదలకు ఆశ్రయమిస్తున్నది.
నిజాం హయాంలో దేశ్ముఖ్లు, దేశాయిలు, దేశ్పాండ్యలుగా పిలువబడే భూస్వాములు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పాలనాధికారం చేపట్టేవారు. వారు తమ పాలన, రక్షణ కోసం గడీలను నిర్మించుకునేవారు. ఇదే కోవలో మండలంలోని రాజారం గ్రామంలో దాదాపు 13ఎకరాల విశాలమైన స్థలంలో గడిని అప్పటి దేశ్ముఖ్ జువ్వాడి చొక్కారావు 1910లో నిర్మించారు. ఈ గడి బీర్సానీ, పెంబట్ల కోనాపూర్, భీమారం గ్రామాలకు కేంద్రంగా ఉండేది. ఈ గ్రామాల్లో అప్పట్లో ఏ సర్వే నంబర్ ఎవరి పేరున ఉందో, ఎంత విస్తీర్ణంలో ఉన్నదో.. ఏ సీజన్లో ఏ పంట వేసేవారో.. ప్రభుత్వ భూమి, ఇనామ్ భూమి, మిగులు భూమి, గ్రామ కంఠం, తదితర భూములకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇక్కడ అందుబాటులో ఉండేది.
ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వెనుక (ప్రస్తుత వీఐపీ గెస్ట్ హౌస్) మరో గడి ఉండేది. ఈ గడిలో దేశ్ముఖ్ జువ్వాడి చొక్కారావ్ ధాన్యాన్ని నిల్వ ఉంచేవారు. ప్రస్తుతం నూతన మండలంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా భీమారంలోనూ చొక్కారావు మరో గడి నిర్మించారు. చొక్కారావుకు ఇద్దరు కుమారులు శరత్చందర్రావ్, రామకృష్ణారావ్. పెద్దకుమారుడు శరత్చందర్రావ్కు రాజారం గడిని, చిన్నకుమారుడు రామకృష్ణారావ్కు భీమారం గడిని అప్పగించారు. శరత్చందర్రావు 2014లో మరణించారు. రామకృష్ణారావు ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు.. కాగా, 1946-51 మధ్యలో కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సమయంలో ఈ గడి కొంత భాగాన్ని కమ్యూనిస్టులు కూల్చివేశారు. ప్రస్తుతం ఈ గడి వ్యవహారాలు
శరత్చందర్రావు కుమారులు చూసుకుంటున్నారు.