Rajapur | రామగిరి, ఏప్రిల్ 19 : సింగరేణి అర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్‌లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ (OB) పనులను రాజపూర్ గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా సీ-5 కాంట్రాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్వారీ పనుల సమయంలో జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా భారీగా దుమ్ము, ధూళి వ్యాపిస్తున్నదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుమ్ము కారణంగా గ్రామంలో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని, రోజువారీ జీవనం దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలపై కూడా ధూళి పడుతూ నష్టాలు కలుగుతున్నాయని రైతులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పనులు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నీటిని స్ప్రే చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.
సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు తమ ఆందోళనను విరమించినట్లు తెలిసింది. ఈ ఘటనతో కొంతసేపు ఓసీపీ-2లో పనులు నిలిచిపోయాయి.