రాజన్న సిరిసిల్ల జనవరి 26 (నమస్తే తెలంగాణ): కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మార్గదర్శనంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదని చెప్పారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఆయన హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు సిరిసిల్ల, వేములవాడ డిపోల పరిధిలో 20.05లక్షల మంది మహిళలు జీరో టికెట్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని, ఆరోగ్యశ్రీ సాయం 10లక్షలకు పెరిగిందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, లక్షా 92వేల 544 వచ్చిన అర్జీలను ఆన్లైన్ చేశామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల పెంపు కోసం మిషన్ 80 పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, 80శాతానికి పైగా డెలివరీలు పెరిగాయన్నారు. గర్భిణులు, బాలింతలకు త్వరితగతిన వైద్య సేవలందించేందుకు గానూ మాతృ సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రోగులకు అందిస్తున్న సేవలకు గానూ దవాఖానలకు కాయకల్ప అవార్డులు వచ్చాయని, జిల్లాలోని ఏడు పీహెచ్‌సీలకు ఎనాక్వాస్ సర్టిఫికెట్ లభించిందన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాకు 5స్టార్ రేటింగ్ లభించిందని, ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ పట్టణంగా సిరిసిల్ల జాతీయ స్థాయిలో ధ్రువీకరించారని గుర్తు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమవుతున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. అలాగే దక్షిణకాశీగా పేరు గాంచిన వేములవాడలో అధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, మహశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు గౌతమి పూజారి, ఖీమ్యానాయక్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.