సిరిసిల్ల రూరల్ : తంగళ్లపల్లి మండలం లక్ష్మిపూర్‌కు చెందిన ముగ్ధం అశోక్ (25) అనే యువకుడు ఆర్థిక సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన అశోక్‌కు తల్లిదండ్రులు లేరు. పెళ్లి కూడా కాలేదు. ఒంటరిగా నివసిస్తున్న అశోక్ తన అవసరాల కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు పెళ్లి కావడం లేదనే మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఈ నెల 27న రాత్రి లక్ష్మిపూర్ శివారులోని రైల్వే లైన్ నిర్మాణ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని, అశోక్‌ను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే అశోక్ మృతి చెందినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. అశోక్ చిన్న నాన్న ముగ్ధం రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.