రాజన్న సిరిసిల్ల : నకిలీ వైద్య సర్టిఫికెట్లు(Fake medical certificates) సృష్టించిన వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గోల్లపల్లి పి.వి.సి కార్యాలయంలో వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారిగా పనిచేస్తున్న జె.కొమురయ్య జనవరి 19, 2024 న మెడికల్ ఇన్ వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకొని కరీంనగర్లోని సన్ షైన్ హాస్పిటల్స్ జారీచేసిన సర్టిఫికెట్లను సమర్పించారు. అనంతరం విచారణలో జె. కొమురయ్య సమర్పించిన సన్ షైన్ హాస్పిటల్స్ వైద్య సర్టిఫికెట్లు ఫేక్ అని తేలింది.
2017 నుంచి సదరు వైద్యుడు దవాఖానలో పనిచేయడం లేదని, లెటర్ హెడ్, స్టాంప్స్ మొత్తం నకిలీ అని, సంతకాలు కూడా వైద్యులు చేయలేదని విచారణలో తేలినట్లు కలెక్టర్ తెలిపారు. నకిలీ వైద్య పత్రాలు సృష్టించినందుకు సంబంధిత వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి పై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించినందుకు గాను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.