సిరిసిల్ల టౌన్, మార్చి 3: సాగునీరు లేక ఎండిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య(Thota Agaiah)డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక పంటలు ఎండిపో తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించడం లక్ష్యంగా కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్10 ఏళ్ల పాలనలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వ్యవసాయాన్ని దండగలా మార్చిందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 425 ఎకరాలలో పంట ఎండిపోయిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది నడుస్తున్న గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే ఉపాధి లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మహేందర్ రెడ్డి వీలైతే సిరిసిల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
రైతుల పక్షాన నిలిచిన కేటీఆర్, సాగునీటి విడుదలకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నియోజకవర్గం లోని సాగునీటి ప్రాజెక్టులు, కెనాళ్లు, కాలువలు, చెరువులు, గుంటలు నిండుకుండలా ఉన్నాయన్నారు. ప్రజల చేత తిరస్కరించబడిన కేకే మహేందర్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. రాబోవు రోజుల్లో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు.