సిరిసిల్ల టౌన్, జూలై 7 : సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు శివారులో గల ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కు చెందిన రావుల ఎల్లయ్య(52)గా గర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. రావుల ఎల్లయ్య స్థానిక గాంధీనగర్ కూరగాయల మార్కెట్లో హమాలి కార్మికుడిగా పనిచేసేవాడు. రోజూ మాదిరిగానే జూలై 4 శనివారం ఇంట్లో నుండి పనికి వెళ్లిన ఎల్లయ్య రాత్రి కూడా తిరిగి రాలేదు. దాంతో, ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికారు. అయినా అతడు కనిపించకపోవడంతో ఆదివారం జూలై 5 ఉదయం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో రావుల ఎల్లయ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎల్లయ్య ఆచూకీ కోసం వెతికారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పెద్దూర్ శివారులోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో ఉన్న ఓ గుంతలో గుర్తు తెలియని మృతదేహంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్, పట్టణ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన ఎల్లయ్య కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు.
ఎల్లయ్య మృతదేహంపై గాయాలు, కాలినట్లు ఆనవాళ్లు ఉండడంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎల్లయ్యను అక్కడే చంపేశారా లేదా వేరు ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్న సీఐ శ్రీనివాస్.. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ మొదలుపెట్టామని వెల్లడించారు.