Collector Sandeep Kumar Jha | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, జూన్25 : రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలో అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందని, రైతులకు అవసరమైన మేర ఎరువులను స్టోర్ చేయాలని అన్నారు.
ప్రైవేట్ డీలర్లకు ఖరీఫ్ సీజన్ లో ఎంత ఎరువుల అలాట్మెంట్ ఉందని, రైతులకు ఏ మేర విక్రయం చేశారని, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందని ఆరా తీశారు. ప్రతీ డీలర్ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ ఈపాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువుల విక్రయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బల్క్ స్టాక్ పెట్టుకొని కృత్రిమ కోరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల షాపులకు ఎంత స్టాక్ ఏ సమయంలో సరఫరా చేస్తున్నారని, ప్రతీ షాప్ వద్ద ప్రస్తుతం ఎంత స్టాక్ ఉందనే వివరాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలి బేగం, వివిధ ఎరువుల కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.