కాళేశ్వరం జలాలతో ఎండిన బీడులను సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు. ఇన్నాళ్లూ బీడులుగా మారిన తన వ్యవసాయ భూమి నుంచి కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని, అందులో భాగంగా కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఏడాదిలో తాను పండించే రెండు పంటల నుంచి వచ్చిన ఆదాయాన్ని పంటకు పదివేల రూపాయల చొప్పున ఆరునెలలకు ఒకసారి సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలని తలచాడు. తలచిందే తడవుగా.. శుక్రవారం ప్రగతి భవన్కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్కు తాను తెచ్చిన 10 వేల రూపాయలను అందించాడు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి రంగం అభివృద్ధితో పాటు విద్యుత్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధితో.. తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. అంతే కాకుండా వాణిజ్య పంటలను వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారు. ఏదో సంస్థలో అర కొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. సొంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల నడుమ ప్రకృతితో భాగమై ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని తమ సొంత కాళ్ల మీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి తన సంపాదనలో నుంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు సాయం చేసేందుకు తన పంటలో కొంత భాగాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. అతడికి నా అభినందనలు.. అని సీఎం రైతు శ్రీనివాస్ రెడ్డి గొప్పదనాన్ని కొనియాడారు.