Jana Nayagan | కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ అడ్డంకులను అధిగమించింది. గత కొన్ని నెలలుగా సెన్సార్ ప్రక్రియలో ఎదురైన వివాదాలు, అభ్యంతరాలు, రివైజింగ్ కమిటీ పరిశీలనల అనంతరం చిత్రానికి తుది క్లియరెన్స్ లభించింది. దీంతో దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న సెన్సార్ వివాదానికి ముగింపు పలికినట్టైంది.గత వారం చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ లభించినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన కొన్ని మార్పులను చిత్రబృందం అమలు చేసింది. అనంతరం మళ్లీ పరిశీలించిన బోర్డు తాజా సవరణలతో కొత్త సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
ఈ మార్పుల కారణంగా చిత్రంలో అదనంగా 41 సెకన్ల ఫుటేజ్ చేర్చారు. దీంతో సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లుగా ఖరారైంది. ‘జన నాయగన్’లోని కొన్ని రాజకీయ నేపథ్య సన్నివేశాలు, కీలక సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గత ఏడాది డిసెంబర్ నుంచి సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం రివైజింగ్ కమిటీ పరిశీలన, న్యాయపరమైన ప్రక్రియల తర్వాత చిత్రబృందం అవసరమైన మార్పులు చేసి చివరకు సెన్సార్ క్లియరెన్స్‌ను పొందింది.
సెన్సార్ సమస్యలు పరిష్కారమైన వేళ మరోవైపు సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడం నిర్మాతలను కలవరపెడుతోంది. పైరసీని అరికట్టేందుకు చిత్రబృందం ఇప్పటికే తగిన చర్యలు చేపట్టినట్లు సమాచారం. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రాల్లో ఇదొకటిగా భావిస్తున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ వివాదాలకు తెరపడటంతో ఇప్పుడు చిత్రబృందం పూర్తి దృష్టిని విడుదలపై పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా జులై 24న ‘జన నాయగన్’ను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.