Tammareddy Bharadwaja | తెలుగు చిత్రసీమలో ముక్కుసూటి మాటలు మాట్లాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇండస్ట్రీలో ఎవరైనా సరే, తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పే స్వభావం ఉన్న ఆయన.. తాజాగా ‘వదల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో టాప్ కమర్షియల్ దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడితో పనిచేయాలని స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.
అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా పెద్ద దర్శకుడు అయిపోయాడు. ఈ కార్యక్రమానికి వస్తాడో లేదో అనుకున్నాను. ‘గురువుగారు… మీరు ఫోన్ చేయండి’ అన్నాడు. కానీ నేను కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఏమైందో అనుకున్నా. తర్వాత సాయంత్రం ఆయనే తిరిగి ఫోన్ చేసి మాట్లాడాడు. ఈవెంట్కు తప్పకుండా వస్తానని చెప్పి, మాట నిలబెట్టుకున్నాడు అని తమ్మారెడ్డి వెల్లడించారు. అనిల్ రావిపూడిని ఆటపట్టించిన తమ్మారెడ్డి వెంటనే తనపై కూడా సరదాగా కామెంట్ చేశారు. మేము కూడా ఒకప్పుడు దర్శకులుగా బిజీగా ఉన్నప్పుడు చాలామందిని అలాగే వెయిట్ చేయించేవాళ్లం. ఫోన్లు కూడా వెంటనే ఎత్తేవాళ్లం కాదు. కాబట్టి అనిల్ అలా చేయడంలో తప్పేమీ లేదు అంటూ నవ్వుతూ చెప్పడంతో సభలో సందడి వాతావరణం నెలకొంది.
తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు అనిల్ రావిపూడి కూడా చిరునవ్వుతో స్పందించగా, అక్కడున్న సినీ ప్రముఖులు చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా తమ్మారెడ్డి చెప్పిన మాటలను సరదాగా తీసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ‘వదల’ చిత్రంతో జగపతిబాబు హీరోగా, లయ హీరోయిన్గా మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు హిట్ జోడీగా నిలిచిన వీరిద్దరూ మళ్లీ కలిసి నటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో విడుదల కానుంది.