సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 1: సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో గర్భిణిలు , రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ సేవలు ఆపి వేయడంతో రోగులు దవాఖాన ప్రాంగణంలో ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం నుంచే హాస్పిటల్కు వచ్చిన గర్భిణిలు స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి ఉన్నా వైద్యులు స్పందించడం లేదని ఆరోపించారు. నొప్పులతో బాధపడుతూ కూర్చోవడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కానింగ్ చేయాల్సిన డాక్టర్ అందుబాటులో లేరని హాస్పిటల్ సిబ్బంది చెప్పడం మరింత ఆగ్రహానికి దారితీసింది. మూడు రోజులుగా స్కానింగ్ చేయడం లేదని, ఇక ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని రోగులు ప్రశ్నిస్తున్నారు. పైసలు లేక ప్రభుత్వ దవాఖానకు వచ్చామని, ఇక్కడ కూడా సరైన వైద్య సేవలు అందకపోవడం బాధాకరమని రోగులు చెబుతున్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మీడియా రావడంతో హడావుడిగా స్కానింగ్ డాక్టర్ ను ఏర్పాటు చేసి గర్భిణిలకు మాత్రమే స్కానింగ్ తీస్తామని చెప్పి మిగతా రోగులను అక్కడి నుంచి పంపించేశారు. మేము చావు బతుకుల మధ్య ఉంటే మాకెందుకు స్కానింగ్ చేయరని మిగతా రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే చర్యలు తీసుకోవాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.