టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న గ్రామీణులు
కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అధికారులు
శంకరపట్నం, ఏప్రిల్ 24; మండలంలోని కాచాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరానికి గ్రామస్తుల నుంచి చక్కని స్పందన లభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 45 సంవత్సరాలు పైబడిన 267 మంది టీకాలు వేయించుకున్నట్లు ఎంపీడీవో భీమేశ్ తెలిపారు. అలాగే ఇటు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 272 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు ఫార్మాసిస్ట్ మతిన్ వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భీమేశ్, ఎంపీవో సురేందర్, వైద్యాధికారులు డాక్టర్ కిరణ్‌రాజ్, డాక్టర్ విద్యశ్రీ, సీహెచ్‌వో భాస్కర్, ఫార్మాసిస్ట్ మతిన్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలో వైరస్ విజృంభణ
కరోనా మహమ్మారి మండలంలో విజృంభిస్తోంది. వారం రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతున్నది. కొన్ని ఇండ్లల్లో ఒకేసారి ఇద్దరి నుంచి నలుగురి వరకు వైరస్ బారిన పడుతున్నారు. కొవిడ్ పరీక్షలతో పాటు టీకాలు వేసే పనిలో ఉన్న అనేక మంది వైద్య సిబ్బంది సైతం కరోనా బారిన పడడం ఆందోళన రేకెత్తిస్తోంది.
గన్నేరువరం, ఏప్రిల్ 24: మండలంలోని గునుకులకొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలను సర్పంచులు లింగంపెల్లి జ్యోతి, కర్ర రేఖ, ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు ప్రారంభించారు. 45 ఏండ్లు నిండిన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా తీసుకున్నారు. ముందుగా గుండ్లపల్లి సర్పంచ్ బేతెల్లి సమతా రాజేందర్‌రెడ్డి, గునుకులకొండాపూర్ సర్పంచ్ లింగంపెల్లి జ్యోతి, చీమలకుంటపల్లి ఉప సర్పంచ్ జంగిటి ప్రకాశ్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్లు రమేశ్‌కుమార్, ఎస్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు పీ సుజాత, బీ అనిత, పీ రాధ, భూలక్ష్మి, మంజుల, ఆశ కార్యకర్తలు జీ పద్మ, మంగ, కే పద్మ, అంగన్వాడీ టీచర్లు ఉదారవతి, పీ విజయలక్ష్మి, ఈ-పంచాయతీ ఆపరేటర్లు రాజశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
34 మందికి కరోనా పాజిటివ్
చిగురుమామిడి, ఏప్రిల్ 24: మండలకేంద్రంలో శనివారం 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 34 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ వసుధా భరద్వాజ్ తెలిపారు. చిగురుమామిడిలో 242, బొమ్మనపల్లిలో 449 మందికి టీకా వేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు. బొమ్మనపల్లిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో ఖాజామొహినొద్దీన్ పరిశీలించారు.