సిరిసిల్ల టౌన్, మార్చి 28: ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University )నిరసనలు చేపట్టొద్దని ఇచ్చిన సర్క్యులర్ని రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రభుత్వం పనితీరు ఉందన్నారు.
ఉస్మానియా ఉద్యమ స్ఫూర్తి రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కక్షపూరిత రాజకీయ పరిపాలన మానుకోవాలన్నారు. మీ రాజకీయ భవిష్యత్తు కోసం వర్సిటీని వాడుకున్నారు. ఉస్మానియా విద్యార్థులతో బస్సు యాత్ర చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. తమ హక్కుల కోసం పోరాడే విద్యార్థులను అణగదొక్కే విధంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్భందం కొనసాగిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.