Yellareddypet Park | ఆహ్లాదం కోసం అడుగుపెట్టాల్సిన పార్కు.. పందుల గుంపులతో దర్శనమిస్తోంది. చిన్నారులు, ప్రజలు సరదాగా గడిపే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పార్కులో సుమారు 50 నుంచి 60 పందులు స్వేచ్ఛగా సంచరిస్తూ మేత మేస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కు నిర్వహణపై అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది కనీస దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.
పార్కు ప్రాంగణంలో పందులు గుంపులుగా తిరుగుతుండటంతో సందర్శకులు అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఆడుకునే ప్రదేశంలో ఇంత పెద్ద సంఖ్యలో పందులు సంచరించడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. పార్కులో పందుల సంచారంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పార్కు నిర్వహణ, పారిశుద్ధ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నా.. సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
50–60 వరకు పందులు పార్కులో సంచరిస్తున్నా వాటిని అరికట్టేందుకు చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కు చుట్టూ పరిశుభ్రత, పందుల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పార్కును శుభ్రపరిచి, పందుల సంచారాన్ని అరికట్టి ప్రజలు, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.