సిరిసిల్ల రూరల్, జూలై 12: రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తంగళ్లపల్లికి చెందిన ఎండీ భాషామియా (56)ను ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు.
భాషామియాకు భార్య హమీనా, కొడుకు షారుఖ్ ఖాన్,ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన భాషామియా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. హమీనా అనారోగ్యంతో బాధపడుతున్నదని, కొడుకు షారుక్ ఖాన్కు మానసిక స్థితి బాగాలేదని గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్నా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు ఇంకా గుర్తించకపోవడం గమనార్హం.