Siricilla : అప్పులు చేస్తూ.. మద్యానికి బానిసైన ఒక వ్యక్తిని భార్య మందలించింది. ఏదైనా పని చూసుకోవాలని చెప్పగా.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎల్లా రమేష్(41)గా గుర్తించారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ గత కొంతకాలంగా.. ఏం పనిపాటా లేకుండా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. తరచూ అప్పులు చేస్తున్న అతడిని భార్య లత మందలించింది.
ఖాళీగా ఉంటూ అప్పులు చేసే బదులు ఏదైనా పని చేయమని ఆమె రమేష్తో చెప్పింది. దాంతో.. రమేష్ డిసెంబర్ 03న మధ్యాహ్నం 02:00 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయాడు. అలా వెళ్లిన రమేష్ శుక్రవారం ఉదయం 10:00 గంటల సమయంలో తంగళ్ళపల్లి గ్రామ శివారులో గల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లత పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.