రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్ల రూరల్/కోనరావుపేట: రాష్ట్రం లో అమలవుతున్న దళితబంధు ఒక విప్లవాత్మక పథకమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. లక్షలాది దళితకుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైనంతగా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, దమ్ముంటే ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన, పలుచోట్ల ప్రసంగించారు.
‘దళితబంధు’ వినియోగం విన్నూత్నంగా ఉండాలి
దళితబంధు పథకం ద్వారా సంపదను సృష్టించే మార్గాలను వెతుక్కోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. డిక్కి సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల తయారీకి యత్నిస్తున్నామని, జిల్లాలో లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకునేలా ఈ సంస్థ ప్రతినిధుల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు యువత తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శించి అందిపుచ్చుకోవాలని సూచించారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, కార్లు కాకుండా విన్నూత్నంగా రైస్‌మిల్లులు, మెడికల్ షాపులు, సిమెంట్ బ్రిక్స్ తయారీ, రెడిమిక్స్, తదితర పరిశ్రమలను స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. 1987లో సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న సమయంలో చేపట్టిన ‘దళిత చైతన్య జ్యోతి’ కార్యక్రమ స్ఫూర్తితోనే దళితబంధు చేపట్టామన్నారు. ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.17,800 కోట్లు కేటాయించామని, రెండు లక్షల మంది లబ్ధిదారులకు వర్తింపజేస్తున్నామని వెల్లడించారు.
దళిత అభ్యున్నతి పథకానికి ఒక బడ్జెట్లో ఇంత భారీగా కేటాయించిన సీఎంను చరిత్రలో ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్ట్‌లలో సైతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ కంటే అధిక నిధులు వెచ్చిస్తున్నామన్నారు. దళితుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. దళితుల కోసం 50 మహిళా రెసిడెన్సియల్ కళాశాలలు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. ఎస్సీ గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా రూ.20 లక్షల స్కాలర్షిప్ అందిస్తున్నామని వెల్లడించారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటా వచ్చే నీటి బొట్టులో, 24 గంటల కరెంటు వెలుగుల్లో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారని ప్రజలు అంటున్నారని తెలిపారు. పదింతలు పింఛన్ పెంచడమే కాకుండా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు సైతం అందిస్తూ వారికి అండగా ఉంటున్న ప్రభుత్వం తెలంగాణేనని స్పష్టం చేశారు.
హుస్సేన్‌సాగర్ పక్కన 125 అడుగుల విగ్రహం
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ పక్కన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలో ఉన్న అంబేద్కర్‌వాదులంతా తెలంగాణవైపు చూసేలా రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో దళితులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ వ్యవస్థలను నాశనం చేస్తున్న అరాచక శక్తులకు కాలం చెల్లిందని హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు ఉన్నత చదువులు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రైతుబంధు పథకం కింద రూ.50,483 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించిన ఏకైక సర్కారు తెలంగాణ అని కొనియాడారు. మండుటెండల్లో సైతం 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, వితంతులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని వ్యాఖ్యానించారు.
టీ-ప్రైడ్ ద్వారా రూ.200 కోట్ల రాయితీ రుణాలను మూడు వేల మంది దళిత పారిశ్రామిక వేత్తలకు అందించి వారి అర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించుకునే విషయంలో అందరం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్లే తెలంగాణ రా్రష్ట్రం సిద్దించిందని, పాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో నూతన జిల్లాలు , రెవెన్యూ డివిజన్లు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని దేశప్రజలంతా గౌరవిస్తుండగా, కొన్ని పార్టీలు ఇదే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితబందు పథకం అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు బీసీ బంధు, మైనార్టీ బంధు ఏర్పాటు చేయాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, దీనిని అడ్డుకుంటున్న కేంద్రంపై మైనార్టీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతునివ్వాలని, ఉమ్మడి పాలనలో సిరిసిల్ల ఎట్లుండెనో, నేడు ఎట్లుందో పోల్చుకోవాలని సూచించారు.
ప్రపంచంలో రెండే కులాలు
దేవుడు మనుషులను పుట్టించగా, ఆ మనుషులు కులాలను పుట్టించారని మంత్రి కేటీఆర్ వివరించారు. మన దేశంలో మనుషులు కలిసి ఉండే అలవాటు లేదని, మతం కులం పేరుతో చిచ్చులు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రపంచంలో ఉన్నవి రెండే కులాలని, ఇందులో ఒకరు ఉన్నోళ్లని, రెండు లేనోళ్లని అన్నారు. దేశంలో అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను ఎవరూ పట్టించుకోరని, దళితులు, గిరిజనుల్లో డబ్బులు ఉండి పైకి వచ్చిన వారి విషయంలో ఏ ఇబ్బంది లేదని, అందుకే డబ్బు ఉన్నోళ్లు, లేనోళ్లు అనే రెండే విషయాలు సమాజంలో ప్రధానంగా మారాయని పేర్కొన్నారు. సృ ష్టించిన సంపదను సమాజంలో సమానంగా పంచగలిగితే కుల, మత వ్యవస్థలను రూపుమాపే అవకాశం ఉంటుందన్నారు. దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడని, ఎవరికైనా రక్తం ఎర్రగా ఉంటుందని, మతం, కులం, ఉపకులం అని సమాజంలో పుట్టించింది మనుషులమేనని తెలిపారు. తాను అమెరికాలో ఉండగా తెల్ల, నల్లవారనే వివక్ష చూశానని, కానీ, ఆశయం గొప్పదైతే, ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ఎదగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలివి ఎవరి సొత్తూ కాదని, తనకున్న తెలివిని ఉపయోగించుకొని భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలువాలని సూచించారు.
కుల, మత పంచాయతీ లేదుగనుకనే చైనా ఎదిగింది
1987లో భారత్-చైనా జీడీపీ ఒకటేనని, అప్పుడు ఇరుదేశాల జీడీపీ 400 బిలియన్ డాలర్లు ఉండేదని గుర్తు చే శారు. ఈ 35 ఏండ్లలో చైనా ఉత్పాదక రంగంపై దృష్టి సారించడం వల్లే ఆర్థికంగా గణనీయమైన ప్రగతిని సాధించిందని, ప్రస్తుతం చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లు కా గా, భారత దేశ జీడీపీ 2.9 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనని చెప్పారు. మన దేశం కంటే 5.7 రెట్లు ఎక్కువగా పెరిగిందని, అక్కడ కుల, మత పంచాయతీలు లేనందునే ఆ దేశం బాగుపడిందని తెలిపారు. ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 14 వేల డాలర్లు కాగా, భారత దేశ తలసరి ఆదాయం రెండువేల డాలర్లు మాత్రమే ఉందన్నారు.
రాష్ర్టానికే ఆదర్శం.. మంకు రాజయ్య : మంత్రి కేటీఆర్
ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తూ నిరుపేదలకు ఉన్నత విద్యను అందించిన మహోన్నత వ్యక్తి మంకు రాజయ్య అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఆయన కరోనా మహమ్మారితో బలికావడం దురదృష్టకరమన్నారు. కానీ, ఆయన జ్ఞాపకాలు, చేసిన సేవలు, స్మృతులు ఎల్లప్పుడూ గుర్తుంటాయన్నారు. మండల విద్యాధికారిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో రాజకీయలకు అతీతంగా అందరినీ ఏకం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఐక్యతతో కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. రాష్ర్టానికి మోడల్ ఏంఈవోగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు గతంలోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి అహర్నిషలు కృషి చేసిన వ్యక్తి అని చెప్పారు. గతంలోనే ఏంఈవో రాజయ్య గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయనను చూడాలని సీఎం సూచించారని, మంకు రాజయ్య కలిసినట్లయితే ‘మన ఊరు మన బడి’ అనే కార్యక్రమం అప్పుడే ప్రారంభమయ్యేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ టైపే రాజయ్యకు మంకు ఉండేదని, నిరుపేదలకు విద్య అందించాలనే తపన పట్టుదల రాజయ్యలో ఉండేదని, అతనిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈప్రాంతంలో విద్యారంగంపై రాజయ్య చెరగని ముద్ర వేశారన్నారు. ఉపాధ్యాయులంతా కలిసికట్టుగా పట్టుదలతో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు అణగారినవర్గాలకు, పేదలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద విశ్వాసం పెంచి, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తీర్చిదిద్దడమే రాజయ్యకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అంతకు ముందు రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడురు ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, రాష్ట్ర ఆహారభద్రత కమిటీ సభ్యుడు వో రుగంటి ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాద్యక్షులు జిందం చక్రపాణి, కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, ఇతర ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, సర్పంచ్ గున్నాల అరుణ, ఎంఈవో దూస రఘుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, మంకు రాజయ్య భార్య శైలజ, కూతురు లాస్య, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, దేవరకొండ తిరుపతి, జిల్లాస్థాయి అధికారు లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.