నాడు ఉరిసిల్ల.. అదో చేదు నింపిన గతం. నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. నేడు ‘సిరి’సిల్ల.. ఇప్పుడిదొక వస్త్ర వసంతం. ఇందుకు ప్రగతిరథ సారథి, మంత్రి కేటీఆర్ నిరంతర కృషే కారణం. దశాబ్దాలుగా దగాపడ్డ కార్మికక్షేత్రానికి ఊపిరిలూది పునర్జీవం పోశారు. కార్మికులు ఎంత చేసినా తరగని పనితో ఒక ఉపాధి గనిగా మార్చి, అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన ఆయన, సకల జనులకూ ‘నేనున్నాననే’ ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎవరికైనా ఆపదొస్తే దేవుడికి మొక్కడం చూస్తుంటాం కదా.. కానీ, జిల్లాలో అభాగ్యులకు మాత్రం కష్టమొస్తే మంత్రి రామన్నను తలుచుకునేంతలా చేరువయ్యారు. నేరుగా కలిసి చెప్పుకున్నా, లేదా ట్విట్టర్, వాట్సాప్ ద్వారా చేరవేసినా విద్య, వైద్యం, ఆర్థిక, గల్ఫ్.. ఇలా సమస్య ఏదైనా తక్షణమే స్పందిస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఒక్క జిల్లానే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. నేడు రామన్న పుట్టిన రోజు సందర్భంగా ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
– రాజన్న సిరిసిల్ల, జూలై 23 (నమస్తే తెలంగాణ)
మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల జిల్లాకు ఓ వర పుత్రుడని పేరుంది. ఆయన వచ్చిన తర్వాత జిల్లా ఏర్పాటు చేయించారు. పేదింటి పిల్లలు ఉన్నత చదువుల కోసం పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు మెడికల్, జేఎన్టీయూ, ఐటీఐ, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు తీసుకొచ్చి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. కార్మిక, ధార్మిక క్షేత్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చొరవ చూపుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో సర్కారు దవాఖానలను ఆధునీకరించి కార్పొరేట్ స్థాయిలో వై ద్య సేవలందించేలా చేశారు. రూ.వందల కోట్లతో జిల్లా కేంద్రంలో రహదారులు, బైపాస్‌లు నిర్మించారు. ఎదురెక్కిన గోదావరి జలాలతో పర్యాటక కేంద్రంగా మానేరును అభివృది చేస్తున్నారు. అప్పారెల్ పార్కుతో వేయి మంది మహిళకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టా రు. మరో పదివేల మందికి ఉపాధి లభించేలా ఎస్సారార్ రిజర్వాయర్‌లో ఆక్వాహబ్ ఏర్పాటు చేస్తున్నారు. కాగా, తన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరిట పేదలకు సేవలందించాలని గ తంలో తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర మంతటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఏరి యా దవాఖానకు ఆరు అంబులెన్సులను ఇచ్చా రు. వందలాది మంది దివ్యాంగులకు ద్విచక్ర స్కూటీలు అందించారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలు, ‘అన్నా ప్రాణం కాపాడంటూ’ ఆర్థించిన వెంటనే స్పందించి వెంటనే ఎల్వోసీ ఇ చ్చి ఆదుకుంటున్నారు. ఉండటానికి ఇల్లు లేదని అడగ్గానే సొంత డబ్బులతో ఇల్లు కట్టించి ఎందరో అవ్వలకు నీడనిస్తూ మనసున్న రామన్నగా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
పెను సంక్షోభంతో ఉరిసిల్లగా మారిన వస్త్ర పరిశ్రమకు రామన్న తన శక్తులన్నీ దారపోసి పూర్వ వైభవం తెచ్చారు. నేతన్నల నైపుణ్యాన్ని విశ్వానికి చాటేలా కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.వేల కోట్లు నిధులు ఇప్పించి చేనేత, మరనేతన్నలకు చేయూతనిచ్చారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లతో చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం వచ్చేలా చేసి, రూ.5లక్షల బీమా సౌకర్యంతో వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. త్రిఫ్టు, చేనేత లక్ష్మి, చేనేత మిత్ర, రుణమాఫీ, వర్కర్ టూ ఓనర్ లాం టి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి చేనేత, మరమగ్గాల కార్మికులకు చేయూత నిచ్చారు.
సాగునీటి తండ్లాటతో వ్యవసాయాన్ని వీడి అడ్డా కూలీలుగా మారిన అన్నదాతలకు ‘నేనున్నానంటూ’ కొండంత భరోసా నిచ్చారు. గోదావరి జలాలతో మెట్టను అభిషేకించి, సిరిసిల్ల ప్రాంతా న్ని సస్యశ్యామలం చేస్తానని నాడు ఇచ్చిన మా టను నిలబెట్టుకున్నారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ ఎత్తిపోతల ద్వారా కోనరావుపేట మండలం మ ల్కపేట గుట్టలో మూడు టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించారు. ఎండి పోతున్న యాసంగి పంటలకు రంగనాయక, మల్లన్న సాగర్ జలాలను తెచ్చి యాసంగి పంటలకు జీవం పోసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంత్రి చొరవతో కొత్తగా మరో లక్ష ఎకరాలకు సాగు నీరందనున్నది. పంటల సాగు, దిగుబడి పెరిగినందుకు కర్షకుల కండ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది.
నాడు జిల్లాలో డిగ్రీ వరకే కళాశాలలుండేవి. స్థానికంగా ఉన్నత విద్యాలయాలు లేక ఇతర జిల్లాలకు వెళ్లి చదువు ‘కొనలేని’ పేదింటి పిల్లలు ఇంటర్ పూర్తి చేసి వివిధ పనులలో కూలీలు, గుమస్తాలుగా పనిచేశారు. కేటీఆర్ వచ్చిన తర్వాత రూ.వందలాది కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ, ఐటీఐ, నర్సింగ్, మెడికల్ జెఎన్‌టీ యూ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ లాంటి క ళాశాలలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు బం గారు బాటలు వేస్తున్నారు. విద్యార్థులకు అన్నగా వెన్నంటి ఉండి విద్యాబోధన అందిస్తున్నందుకు పేదింటి పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వస్త్ర పరిశ్రమకే పరిమితమైన సిరిసిల్ల జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించారు. వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తూనే మరోవైపు అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ కృషి చేస్తున్నారు. సరైన ఉపాధి అవకాశాలు లేని బీడీ పరిశ్రమలో పొగచూరుతున్న మహిళల జీవితాలకు భరోసా నిచ్చేలా ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చేస్తున్నారు. 65 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్కులో అంతర్జాతీయ కంపెనీలు తీసుకొస్తున్నారు. గోకుల్దాస్ కంపెనీ గ్రీన్ ఇండియా యూనిట్లో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభించింది. రెండు వేల మందికి ఉపాధి కల్పించేందుకు రెండు కంపెనీలు ముం దుకొచ్చాయి. 10వేల మంది స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా మధ్యమానేరులో ఆక్వాహబ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే గంభీరావుపేట మండలం నర్మాలలో అతిపెద్ద పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. అందులోనూ పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వెనుకబడ్డ ధార్మిక, కార్మిక క్షేత్రంలో సరైన సౌకర్యాలతో దవాఖానలు లేక మెరుగైన వైద్యం కో సం ప్రజలు కరీంనగర్, హైదరాబాద్‌లకు వెళ్లాల్సి వచ్చేది. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉండేది. ఈ ప్రాంత పేదల దయనీయ స్థితికి చ లించిన రామన్న, వంద పడకలున్న సిరిసిల్ల ఏరి యా దవాఖానకు రూ.159 కోట్లు మం జూరు చే యించి, 300 పడకల స్థాయికి పెంచారు. ప్రస్తు తం రెండో బైపాస్‌రోడ్డులో అధునాతన సౌకర్యాలతో దవాఖాన నిర్మాణం తుది దశలో ఉంది. వేములవాడ దవాఖానలో మోకాలు కీలు ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఏరియా దవాఖానలో ప్రసవాలు పెంచడంతో పాటు బ్లడ్ బ్యాంక్, ఐసీయూ, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేం ద్రం ఏర్పాటుకు కృషి చేశారు. కరోనా టైంలో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వందలాది మందికి వైద్యులు ఉచిత వైద్యం అందించారంటే అది మంత్రి చొరవతోనే.
పేదలే కాదు మలి సంద్యలో ఉన్న వృద్ధులకు సైతం అమాత్యుడు చేయూత నిచ్చాడు. వారు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు (డేకేర్)సెంటర్లు పెట్టించారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం, తంగళ్లపల్లిలో నిర్వహిస్తున్నారు. రూ.లక్ష ల ఖర్చుతో ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్లలో పిజీయోథెరపి, టీవీ, ఆటవస్తువులు, గార్డెన్లు, మంచి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. తమ పట్ల ఔదార్యం చూపిన రామన్న వెయ్యేళ్లు బతకాలంటూ వృద్ధులు ఆశీర్వదిస్తున్నారు.
నా పేరు జంగం కిష్టయ్య. మాది నర్మాల. నాకు ఎగువ మానేరు కింద నాలుగెకరాల భూమి ఉన్నది. మానేరు పారకంతో ఆ భూమిలో నేను 50 ఏండ్ల నుంచి ఎవుసం చేస్తున్న. మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడుతున్న రోజుల్లో ఇక్కడ మీటింగ్ పెట్టిన్రు. ‘గోదావరి జలాలను ఎగువ మానేరుకు తెచ్చి అందులో ఏడాది పాటు నీళ్లుండేలా చూస్తాం. ఆ జలాలతో మీ పాదాలు తడుస్తాయని’ కేటీఆర్ ఇచ్చిన మాట నెరవేర్చిండు. గతంలో మానేరులో సాగు నీరు లేక ఏండ్లకో పసలు పంట పండించేవాళ్లం. నాటు వేసినంక పండేదాక నమ్మకం ఉండేది కాదు. నీళ్లు సరిపడక పంట చేతికి వచ్చే ముందు ఎండి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అధికారులు తైబంధు చేయడంతో నాకు ఉన్న నాలుగు ఎకరాలకు గాను రెండెకరాలు మాత్రమే సాగయ్యేది. ఇప్పుడు మూడేళ్ల నుంచి మానేరు ఎండిన దాఖలాలు లేకుండా పోయాయి. మా బీడు భూములకు సాగు నీరు ఇత్తున్న బీఆర్ఎస్ సర్కారు మళ్లీ రావాలి. మా లాంటి భూమిని నమ్ముకుని బతుకున్న రైతులకు పెద్ద సారు అండగా నిలువాలి.
– గంభీరావుపేట, జూలై 23
నా పేరు ఈసంపల్లి హేమ. మాది వీర్నపల్లి మండలం గర్జనపల్లి. భర్త దేవేందర్ కొన్నేళ్లుగా బీఆర్ఎస్లో కార్యకర్తగా పనిచేసిండు. గత జనవరి 24న గుండెపోటుతో మరణించిండు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సర్ మా ఇంటికి వచ్చిండు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మమల్ని సొంత అన్నోలె ఓదార్చిండు. మా కూతుర్లు పూర్వి, చారిక పేరిట రూ.2.50లక్షల చొప్పున రూ.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తానని హమీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ సారు సొంత డబ్బులు బ్యాంక్‌లో డిపాజిట్ చేయించాడు. ఇంటి పెద్దను కోల్పోయి పిల్లల పరిస్థితి ఎట్లా అని ఆలోచిస్తున్న సమయంలో మా కుటుంబాన్ని కేటీఆర్ సారే ఆదుకున్నాడు. మాటిచ్చి నిలబెట్టుకున్న సార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్న.
– వీర్నపల్లి, జూలై 23
మా నాన్న కత్తెర చొక్కారాం. రాజకీయ నాయకుడు. అమ్మ విజయలక్ష్మి. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసింది. నాకు ముగ్గురు చెల్లెల్లు. నాన్న మొదట కాంగ్రెస్‌లో ఉన్నా, తర్వాత మంత్రి కేటీఆర్‌పై అభిమానంతో బీఆర్ఎస్లో చేరాడు. 2016లో అనారోగ్యంతో చనిపోయిండు. కేటీఆర్ సారు మా ఇంటికొచ్చి మమ్మల్ని ఓదార్చాడు. అధైర్యపడొద్దు అండగా ఉంటానని భరోసానిచ్చాడు. నాకు జిల్లా పరిశ్రమల శాఖలో అవుట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగం ఇప్పించాడు. మా కుటుంబానికి ఒక ధీమా దొరికింది. నాన్న ఉన్నప్పుడే పెద్ద చెల్లి వివాహమైంది. మిగతా ఇద్దరు చెల్లెళ్ల పెండ్లి చేశా. రామన్న కల్పించిన భరోసాతోనే కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నా. పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆపదొస్తే నేనున్నానంటూ అండగా నిలిచే నాయకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ర్టానికి కేటీఆర్ లాంటి నాయకత్వం ఉంటే ప్రజలందరికీ భరోసా ఉంటుంది.
– కత్తెర పవన్‌కుమార్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి (సిరిసిల్లటౌన్)