సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 27: ఏజెంట్ మోసంతో గల్ఫ్‌లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాకు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రత్యేక చొరవతో ఇంటికి చేరుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన గౌరయ్య రెండు నెలల క్రితం గల్ఫ్ దేశమైన ఓమన్ (మస్కట్)లో ఏజెంట్ మోసానికి చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో పనిచేయలేక దయనీయ పరిస్థితిలో తనను స్వదేశానికి తీసుకేళ్లాలని, ఏజెంట్ మోసం చేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతల ద్వారా తెలుసుకుని గౌరయ్యను స్వదేశానికి తీసుకువచ్చేలా ఈనెల 12న ఓమన్ ఎంబసీకి కేటీఆర్ లేఖ రాశారు. దీంతోపాటు గౌరయ్యను క్షేమంగా ఇంటికి చేరేలా చూడాలని, న్యాయసహాయం చేయాలని సామాజిక సేవ కార్యకర్త షేక్ అహ్మద్‌ను కోరారు. దీంతో ఆయన ఎంబసీ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు కంపెనీ నిర్వాహకులు పాస్‌పోర్ట్ ఇవ్వగా గౌరయ్యను స్వదేశానికి తీసుకురావడానికి కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. గౌరయ్య టికెట్‌కు నగదు సైతం ఆయన అకౌంట్‌కు పంపించారు.

ఆదివారం రాత్రి అక్కడ నుంచి బయల్దేరిన గౌరయ్య సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అప్పటికే ఎయిర్ పోర్ట్‌లో వేచిఉన్న తంగళ్లపల్లి బీఆర్ఎస్ నేతలు గౌరయ్యను రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కారులో బస్సాపూర్లోని తన ఇంటికి చేర్చారు. భార్య శారద, కొడుకు వరుణ్ తేజ్, కూతురు అవంతికను చూడగానే గౌరయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తనను స్వదేశానికి తీసుకొచ్చిన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తనకు సహకరించిన మస్కట్‌లోని షేక్ అహ్మద్, బీఆర్ఎస్ నేతలు, మిత్రులు బొడ్డు శ్రీధర్, గడ్డం శేషాద్రికి కృతజ్ఞతలు తెలిపారు.