గోదావరిఖని, మే 10 : ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి మరోమారు వివాదాల్లో చిక్కాడు. ఈసారి తెలంగాణ ఉద్యమకారుడిపై బూతు పురాణంతో సీఐ విమర్శల పాలవుతున్నాడు. అసలేం జరిగిందంటే.. ప్రధాన చౌరస్తాలో ఆదివారం సాయంత్రం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వన్ టౌన్ వాహన తనిఖీ చేపట్టారు.
హెల్మెట్ లేకుండా వాహనంపై వెళుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రక్షన సమితి (డెమోక్రటిక్) రాష్ట్ర నాయకుడు తోడేటి శంకర్ గౌడ్‌ను పోలీసులు ఆపారు. హెల్మెట్ లేకపోవడంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని సీఐ ఆదేశించాడు. దీంతో తాను ఉద్యమకారుడిని అని శంకర్ గౌడ్ చెప్పగా.. సీఐ ఆయనని ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. ల….. కొడుకా అని.. బూతు పురాణం మొదలు పెట్టాడు. సీఐ మాటలకు మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ చౌరస్తాలోనే తన చొక్కాను విప్పేశాడు.
అనంతరం పెట్రోల్ బాటిల్‌తో హల్చల్ చేశాడు. దాంతో.. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకుడు కనకరాజులు వెంటనే శంకర్ గౌడ్ చేతిలోని పెట్రోల్ బాటిల్ లాక్కొని ఆయనను అక్కడి నుంచి పంపించారు. అయినా సరే పట్టు వీడని సదరు శంకర్ గౌడ్ సీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమర వీరుల స్తూపం వద్ద గంటకుపైగా నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు ఆయనును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రెండేళ్లకు పైగా గోదావరి ఖనిలో విధులు నిర్వహిస్తున్న సీఐ ఇంద్రసేనా రెడ్డి ప్రతిసారి ప్రతి వివాదాల్లో నిలుస్తున్నాడు. కూల్చి వేతల సమయంలో ఇంటి యజమానిని బెదిరించడంతో పాటు న్యాయవాదులపై సీఐ నోరుపారేసుకున్నాడు. దాంతో.. నెల రోజులకు పైగా విధుల నంచి బహిష్కరణకు గురయ్యాడు.
అంతేకాకుండా ఓ వ్యాపారి పై చేయిచేసుకోవడం, ఎన్నికల సమయంలో ఓ. మాజీ కార్పొరేటర్ ఇంట్లోకి వెళ్లి మహిళలను దూషించడం.. పెద్ద చర్చకు దారి తీసింది. ఈ రెండు వివాదాల్లో బాధితులు సీఐపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సీఐ తీరుపై ఇక్కడి నాయకులు, పోలీస్ ఉన్నత అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోక పోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.