ఎల్లారెడ్డిపేట, జూన్ 1: ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తిమ్మాపూర్, గుండారంలో ఇంకా ఎక్కడి కుప్పలు అక్కడే ఉన్నాయని కొనుగోలు కేంద్రంలో అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. కాంటా పెట్టకపోవడం, హమాలీలు, గన్నీ సంచుల కొరత, ధాన్యం తరలించేందుకు లారీలు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మిల్లర్లతో ధాన్యం కటింగ్ సమస్యతో 40 రోజులుగా రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో మొత్తం ధాన్యం మిల్లులకు తరలించాలని లేకపోతే రైతులతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు రైతుల నిరసనకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రేపాక రామచంద్రారెడ్డి, మారవేణి రంజిత్, కే. ప్రకాశ్, రాజయ్య, సురేశ్, భాస్కర్, తదితరులు ఉన్నారు.