వేములవాడ రూరల్, జులై 14: వేములవాడ (Vemulawada) మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో ఉద్రిక్తత నెలకొన్నది. రోడ్డు నిర్మాణం కోసం భవనాలను కూల్చివేస్తుండటంతో బాధితులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని బుల్డోజర్ల ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడిని నుంచి తరలించారు. వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన ఇరువైపుల భూసేకరణ నిమిత్తం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 30 మంది భూనిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ఆదివారం అర్ధరాత్రి తక్షణమే ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. తిప్పాపూర్ దుకాణాల ముందు నిలిపిన భారీ జేసీబీలను మోహరించారు. అర్ధరాత్రి భవన నిర్వాసితులు, దుకాణదారులు రాత్రికి రాత్రే సామాన్లను సదురుకున్నారు. అర్ధరాత్రి వేళ బుల్డోజర్లను ముందు పెట్టి ప్రభుత్వం నిర్వాసితులను బయందోళనకు గురిచేశారు. బిక్కుబిక్కుమంటూ అప్పటికప్పుడు దుకాణాలను ఖాళీ చేశారు.
సోమవారం ఉదయం నుంచి భవనాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవగా నిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని నిర్వాసితులు భవనంపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల ముందు బైఠాయించిన నిర్వాసితులందరినీ పోలీసుల అడ్డుకొని నుంచి తరలించారు. భవన యజమానులు ఎంత మొత్తుకున్నా వారిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. అడ్డు వచ్చిన వారిని పోలీసులతో అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని కోరుతున్నా రాత్రి నుంచి తమను బయందోళన గురి చేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలు మాత్రం ఆపేదిలేదన్న తీరులో అధికారులు పని చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా, బాఆధితులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.. సమయం ఇవ్వకుండానే దుకాణాలు ఖాళీ చేయడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని యజమానులు బోరుమంటున్నారు.