వేములవాడ రూరల్, జూన్ 17: కక్ష సాధింపులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు నోటీసులు పంపించిందని కేటీఆర్ సేన వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు వంశీ రెడ్డి (Cheruku Vamshi Reddy) ఆరోపించారు. మంగళవారం వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లిలో ఆయన మాట్లాడుతూ ఏసీబీ అధికారులు గతంలో ఒకసారి కేటీఆర్‌ను సుదీర్ఘంగా విచారించి ఏమీ తెల్చలేకపోయరని గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేస్ సజావుగా సాగిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరుగకున్నా, ఎటువంటి అవినీతి చోటుచేసుకోకున్నా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారించడం చట్ట వ్యతిరేకమమన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నగరానికి ప్రత్యేక ఖ్యాతి లభించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి దోహదపడిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై అధికార పక్షం అక్రమ కేసులు బనాయిస్తూ తమ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలుపరిచి ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలుస్తారన్నారు.