సిరిసిల్ల రూరల్, మార్చి 20 : తంగళ్ళపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఆర్.టి.ఐ(RTI) చట్ట ప్రకారం చేసిన దరఖాస్తుకు తప్పుడు సమాచారం అందించారని తాడూరు మాజీ సర్పంచ్ గుర్రం రాజలింగం గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు . తాడూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు వివరాలు సర్వే నంబర్ల సహా ఆర్.టి.ఐ ద్వారా దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు . అందులో కొన్ని సర్వే నెంబర్లు లేకుండా సమాచారం అందించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వే నెంబర్ 515లో గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలకు, బీసీలకు లావాని పట్టాలు కూడా అందించారని తెలిపారు.
సర్వే నెంబర్ 515 లో ఎంతోమంది కబ్జాదారులు, పట్టాలు సృష్టించి , పట్టాలు పొందినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై తహసిల్దార్ జయంత్ కుమార్ ని అడిగితే, అది మానవ సహజం..తప్పు జరిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోండని, అప్పుడు మళ్లీ పరిశీలించి తగిన సమాచారం ఇస్తామని చెప్పిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్.టి.ఐ కింద దరఖాస్తు చేసిన కూడా తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగిన విచారణ చేయాలని కోరారు. అలాగే సర్వే నెంబర్ 515లో ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు .