కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha) వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే.. దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్ట్ పరిధిలో పంటలు వేసిన రైతులు సాగు నీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రాజెక్ట్ లో నీటి నిలువలు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ వెంట ఈఈ కిశోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్, తదితరులు ఉన్నారు.