ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 8: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్ల శంకర్, వేముల వీరేశం వ్యాఖ్యలను బీఆర్ఎస్ యూత్వింగ్ నాయకులు (BRSV) తీవ్రంగా ఖండిచారు. గులాబీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో సాయంత్రం మెరుపు ధర్నాకు దిగారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల చిత్రపటాలతో కూడిన దిష్టి బొమ్మను పాత బస్టాండులో కాసేపు ఉంచి.. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని గమనించిన పోలీసులు పరుగెత్తుకుని వచ్చేలోపు సీఎం, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు.
రోడ్డుపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను తీసి వేసే క్రమంలో బీఆర్ఎస్ యూత్వింగ్ నాయకులు, పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది. అప్పటికే బీఆర్ఎస్వీ నాయకులపై ఆగ్రహంగా ఉన్న సీఐ వెంకటేశ్, ఎస్ఐ రమేశ్.. తమ బృందంతో కలిసి అరెస్టులకు తెర తీశారు. బీఆర్ఎస్ నేతలను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరసన చేపట్టిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు సింగారం దేవరాజు, ల్యాగల సతీశ్‌రెడ్డి, లింగాల సన్నీ, రేసు గణేశ్, సయ్యద్ జుబేర్, నాగరాజులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

యూత్ నాయకుల అరెస్టు సమాచారం తెలియగానే బీఆర్ఎస్ నాయకులు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఉదయం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే లేని కేసులు.. బీఆర్ఎస్ నేతలు దమనం చేస్తే పెట్టడం ఏంటీ? అని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అరెస్టు అయిన నాయకులను పరామర్శించి భరోసానిచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.