సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 20: స్వరాష్ట్రంలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి (Baddenapally) గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) జరిగాయి. 2013లో చివరిసారిగా ఉమ్మడిరాష్ట్రంలో ఈ ఊర్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తర్వాత స్వరాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరిగినప్పటికీ.. గ్రామంలో రిజర్వేషన్ విషయంలో పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు ఆగిపోయాయి. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో పంచాయతీపై బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా (BRS) ఎగురవేసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగ్గిల్ల నిర్మల అంజయ్యగౌడ్ విజయం సాధించారు. 2018లో వీరి పదవీ కాలం ముగిసింది. కాగా, 2018లో కేసీఆర్ ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీరాజ్ చట్టం రూపోందించింది, 2019లో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే బద్దెనపల్లిలో రిజర్వేషన్ల విషయం తేలకపోవడంతో అప్పుడు ఎన్నికలు జరుగలేదు. దీంతో అప్పటి నుంచి ఈ గ్రామం ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. ఈనెల 14న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగడంతో ఏడున్నర ఏండ్ల నిరీక్షణకు తెరపడింది.
ఈ ఎన్నికల్లో సిలువేరి లావణ్య చిరంజీవి భారీ మెజారిటితో విజయం సాధించారు. 2013, 2025లో వరుసగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, స్వరాష్ట్రంలోనైనా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బద్దెనపల్లిలో గులాబీ అభ్యర్థులు గెలవడం.. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
బద్దెనపల్లిలో చివరి సారిగా 2013లో ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగ్గిల్ల నిర్మల -అంజయ్యగౌడ్ విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక.. 2018 వరకు వీరి పదవి కాలం కొనసాగింది. స్వరాష్ట్రంలో తొలిసారిగా 2019లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రిజర్వేషన్‌పై కోర్టు కేసుతో ఎన్నికలు జరగలేదు. 2018 నుంచి ప్రత్యేక అధికారుల పాలనతోనే ఏడున్నర ఏండ్లు కొనసాగింది. కోర్టు కేసు వాపస్ తీసుకోవడంతో ఎన్నికలకు మార్గం సులువైంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా బద్దెనపల్లికి ఈనెల 14న పంచాయతీ ఎన్నికలు జరగడం గమానార్హం. రాష్ట్రం వచ్చినంక సుమారు 12 ఏళ్లకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం గమనార్హం.

స్వరాష్ట్రంలో తమ గ్రామానికి తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు జరగడం సంతోషంగా ఉందని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సిలువేరి లావణ్య అన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏడున్నర ఏండ్ల ప్రత్యేకపాలన తర్వాత పాలకవర్గం కొలువుదీరనుందని తెలిపారు. ఎన్నికల్లో విజయానికి సహకరించిన కేటీఆర్‌కు రుణపడి ఉంటామని వెల్లడించారు. తమ
గెలుపునకు సహకరించిన గ్రామ పెద్దలకు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయజేశారు. కేటీఆర్ సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.