సిరిసిల్ల రూరల్, మార్చి 16 : జిల్లా సర్పంచుల పోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఈ నేపథ్యంలో తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్(BRS) పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, మాట్ల మధుకు 2013 సర్పంచ్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ డబ్బులు ఇచ్చాడని ఆరోపించడంతో బహిరంగ చర్చ చేపట్టాలని, చర్చకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలని మధు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధును చర్చకు రాకుండా పోలీసులు అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ నేతలు సిరిసిల్లకు తరలి వెళ్లారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు.
తాము చర్చకు వచ్చామని, ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను బలవంతంగా తమ వాహనాల్లో లాక్కెళ్లారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాజన్న, బొల్లి రామ్మోహన్, పడిగేల రాజు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, జక్కుల నాగరాజు, కొయ్యాడ రమేష్, గుండు ప్రేమ్ కుమార్, బండి జగన్, నవీన్ రావు, కుంటయ్య, అమర్ రావు, నవీన్ రెడ్డి, కిష్టారెడ్డి, అఫ్రాజ్, భాను మూర్తి, ముత్యం రెడ్డి, కుర్మా రాజయ్య, రామా గౌడ్ పాల్గొన్నారు.